నూతన పార్లమెంట్ భద్రత బాధ్యతలను రేపటి నుంచి CISF చేపట్టనుంది. 3,317 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు CRPF, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా పనిచేసేవి. గత డిసెంబర్లో ఆగంతకులు పార్లమెంటులో ప్రవేశించడంతో కలకలం చెలరేగింది. దీంతో భద్రత బాధ్యతలను CISFకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.
పార్లమెంటు కాంప్లెక్స్‌లోని అన్ని ప్రవేశ ద్వారాలు, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్, అగ్నిమాపక విభాగం,జాగిలాల స్క్వాడ్, కమ్యూనికేషన్ సెంటర్, వాచ్ టవర్‌ల వద్ద సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని నియమించారు.ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. విధ్వంసక కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందినవారిని రంగంలోకి దించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.