ఎమ్మెల్యేకి షాకిస్తున్న సొంత కేడర్

-

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకొనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారనుందా..కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఆ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ నేతలు గురిపెట్టారా.. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారా ఇప్పుడిదే అంశం తెలంగాణ రాజకీయాల్లొ ఆసక్తి రేపుతుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం జిల్లాలోని 12 నియోజికవర్గాల్లో మునుగోడు మినహా మిగిలిన అన్నిచోట్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే గెలిచారు. తాజాగా మునుగోడుపై టీఆరెస్ గురి పెట్టింది. కొంతకాలంగా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మర్రిగూడ ఎంపీపీ మోహన్‌రెడ్డి, పలువురు సర్పంచ్‌లు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారెక్కేశారు.

ఈ పరిణామాలతో మునుగోడులో ఏం జరుగుతుందో కాంగ్రెస్‌వాళ్లకు అర్థం కావడం లేదట. కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పిన వాళ్లంతా హైదరాబాద్‌ వెళ్లి మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి పై ఆశలు పెట్టుకుని గెలిపించిన ప్రధాన అనుచరులంతా వరుస పెట్టి వెళ్లిపోతున్నారట.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం నేపథ్యంలో అప్పటి నుంచే మునుగోడు కాంగ్రెస్‌లో చీలికలు మొదలయ్యాయని అంటున్నారు. ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రకటించినా.. ఎవరూ ఆగే పరిస్థితి లేదట. 2014లో మునుగోడు నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌పై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డిని ఓడించారు రాజగోపాల్‌రెడ్డి. వరుసగా రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో నిరాశ చెందారో ఏమో.. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే విమర్శలున్నాయి. కొందరినే దగ్గరకు తీస్తున్నారట. ఇదే విషయాన్ని చెబుతూ.. పలు సందర్భాలలో కాంగ్రెస్‌లోని మిగిలి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్‌ ఉండదని భావించిన అనేక మంది నియోజకవర్గ స్థాయి నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారట. కాంగ్రెస్‌ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగి.. మండల కమిటీలు వేస్తూ పదవులు కట్టబెడుతున్నా ఎవరూ వినే పరిస్థితి లేదంటున్నారు. మిగిలిన వారినైనా కాపాడుకునేందుకు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారట. రాజగోపాల్‌ రెడ్డి కూడా అందరినీ కలుస్తూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారట. చేనేత కార్మికులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుకుంటున్నారని అంటున్నారు. ఏదిఏమైనా మునుగోడులో కేడర్‌ను కాపాడుకునేందుకు అటు పార్టీ పెద్దలు ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పడుతున్న పాట్లు రాజకీయా వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version