పారుల్ అదుర్స్.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్

-

ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరి దుమ్ములేపారు. 5 వేల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా బహ్రాలా గ్రామానికి చెందిన పారుల్.. రైతు కుటుంబం నుంచి వచ్చారు. బక్క పలచగా ఉండే ఆమె ప్రొఫెషనల్ రన్నర్ గా మారి రాణిస్తున్నారు. కాగా, ఈ క్రీడల్లో ఇప్పటికే భారత్ ఖాతాలో 60కిపైగా పతకాలు చేరాయి. అందులో 14 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.

చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌదరి చరిత్ర సృష్టించింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల పరుగును కేవలం 15 నిమిషాల 14.75 సెకన్‌లలో పూర్తిచేయడం ద్వారా అగ్ర స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. దాంతో ఆసియాడ్‌లో ఐదు కిలోమీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా 28 ఏళ్ల పారుల్‌ రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్‌కు చెందిన హిరోనికా రిరికా 15 నిమిషాల 15.34 సెకన్‌ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. కజకిస్థాన్‌ అథ్లెట్‌ కిప్కిరుయ్‌ కరోలిన్‌ చెప్‌కోయిచ్‌ 15 నిమిషాల 23.12 సెకన్‌ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసి మూడో స్థానంలో నిలువడం ద్వారా కాంస్యం నెగ్గింది. కాగా, పారుల్‌ చౌదరికి ఈ ఆసియాడ్‌లో ఇది రెండో పతకం. సోమవారం జరిగిన 3000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో కూడా పారుల్ చౌదరి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. ఇవాళ ఐదు కిలోమీటర్ల పరుగులో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పారుల్‌ నెగ్గిన పసిడితో కలిసి ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ గెలిచిన గోల్డ్‌ మెడల్స సంఖ్య 14కు చేరింది. మొత్తం పతకాల సంఖ్య 60 దాటింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version