బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో విద్య, ఉద్యోగం, రాజకీయ రిజర్వేషన్లపై వేర్వేరుగా మూడు బీసీ బిల్లులు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. గురవారం జనగామలోని పెంబర్తిలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని అంశాలను ఒకే బిల్లులో పెట్టి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే అది మోసం చేయడమే అవుతుందని పేర్కొన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 52 శాతం వస్తే కాంగ్రెస్ సర్వేలో తప్పుడు లెక్కలు చూపించారని.. బీసీలు కేవలం 46 శాతం ఎలా తేలుతారని.. దాని ప్రకారం 46 శాతం విద్య,ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ రెండు బిల్లులు, కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతో మరో బిల్లు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.