ఏపీ ప్రజలకు శుభవార్త. జగన్ సర్కార్ నెలకొల్పిన గ్రామ సచివాలయాల్లోనే పాస్ పోర్టుతో పాటు పాన్ కార్డు, రైల్వే టికెట్ బుకింగ్ లాంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా వీటిలో పొందవచ్చు. ఎల్‌ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించవచ్చు. ఇప్పటి వరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల పలు కేంద్ర ప్రభుత్వ సేవలు, మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం సచివాలయాల ద్వారా పొందే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. రాష్ట్రంలో మొత్తం 15004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. అన్ని సచివాలయాల్లోనూ అదనపు సర్వీసులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆ సేవలపై సచివాలయానికి ఒకరికి చొప్పున సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. ప్రస్తుతానికి 1600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. వీటికి స్పందన కూడా బాగుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 98 మంది పాస్ పోర్టు సేవలను వినియోగించుకున్నారు.