పతంజలి ఆయుర్వేద సంస్థ తయారుచేసిన కరోనైల్ మెడిసిన్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో బుధవారం నుంచే ఈ మెడిసిన్‌ను దేశమంతటా విక్రయించనున్నారు. ఇక ఈ మెడిసిన్ అమ్మేందుకు గాను ఇప్పటికే పతంజలి ఓ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో యాప్‌లో ఈ మెడిసిన్‌ను ఆర్డర్ చేసిన వారికి ఇంటికే హోం డెలివరీ చేయనున్నారు. ఈ మేరకు యోగా గురువు బాబా రాందేవ్, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణలు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కరోనైల్ మెడిసిన్‌కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చిందని బాబా రాందేవ్ తెలిపారు. ఈ మెడిసిన్‌తో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో 69 శాతం మంది కేవలం 3 రోజుల్లోనే కరోనా నుంచి బయట పడ్డారని మరో 7 రోజుల వ్యవధిలో 100 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. కరోనాను నయం చేయడంలో కరోనైల్ సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. తాము ఆయుష్ మంత్రిత్వ శాఖకు అందజేసిన రీసెర్చి పత్రాలను ఆ శాఖ పరిశీలించిందని, అవి నిజమే అని తేలడంతోనే తమ మెడిసిన్‌కు ఆ శాఖ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. దీంతో బుధవారం నుంచి దేశవ్యాప్తంగా కరోనైల్, స్వసరి మెడిసిన్లను విక్రయిస్తామని ఆయన తెలిపారు.
కరోనైల్ మెడిసిన్‌లో ఎలాంటి లోహాలు వాడలేదని, అశ్వగంధ, తిప్పతీగ, తులసి వంటి మూలికలను వాడామని బాబా రాందేవ్ తెలిపారు. గతంలో తాము హెపటైటిస్, ఆస్తమాలను కూడా నయం చేశామని గుర్తు చేశారు. కరోనైల్ మెడిసిన్ కోసం పతంజలి సంస్థకు చెందిన 500 మంది సైంటిస్టులు రాత్రి, పగలు కష్టపడ్డారని అన్నారు. ఇకపై కూడా వారు తమ శక్తిమేర కృషి చేస్తారని తెలిపారు. కరోనైల్ మెడిసిన్ పట్ల లేనిపోని అపోహలు సృష్టించవద్దని, ఇంగ్లిష్ మెడిసిన్‌ను మెడిసిన్ అని నమ్మేవారు, ఆయుర్వేద ఔషధాలను మెడిసిన్లని ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు.