ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీళ్లు పట్టుకోవడానికి కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఒక ప్రకటన చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాణవత్ సాముని భార్యని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనే కాల్చివేసింది అని అన్నారు. ట్యాంకర్ దగ్గరికి తాగునీళ్లు పట్టుకోడానికి వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లు పట్టుకోరాదు అని అడ్డుకున్నారని అన్నారు.
ఇంట్లో నీళ్లు లేవని ఆమె ప్రాధేయపడ్డా కూడా వినకుండా ట్రాక్టర్ తో ఢీ కొట్టి చంపేశారని రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. వైసిపి వాళ్ళే నీళ్లు తాగాలి గాలి పీల్చాలని జీవో ఇవ్వడం ఒకటే మిగిలిందని అన్నారు. పంచభూతాలకి పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యం ఏలుతోందని మల్లవరం ఘటన మీద పోలీసులు నిష్పక్షపాతంగా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.