ఇక్కడి నాలుగు ఎకరాల భూమిని అధికార పార్టీ కబ్జా చేసింది : పవన్‌

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు మూడో రోజు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సిరిపురం జంక్షన్ దగ్గరి సీబీసీఎన్సీ భూములను పరిశీలించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ… ఈ భూములను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆక్రమించారని ఆరోపించారు. ఇక్కడి నాలుగు ఎకరాల భూమిని అధికార పార్టీ కబ్జా చేసిందని పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు దేవాలయాలు, మసీదులు, చర్చి స్థలాలు అన్నింటిని కబ్జా చేస్తున్నారన్నారు పవన్‌ కల్యాణ్‌. కబ్జాలకు పాల్పడితే జనసేన అడ్డుకుంటుందన్నారు.

విశాఖ చాలా ప్రశాంతవంతమైన నగరమని, అలాంటి నగరాన్ని వైసీపీ నేతలు చెడగొడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. తెలంగాణలో ఇలా దోపిడీ చేస్తేనే తరిమేశారన్న పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా దోచుకుంటూ వెళ్తే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్‌గా మారుతుందని, కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులు దీనిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ కోసం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎలా పోరాటం చేశారో, అలాగే ఉత్తరాంధ్ర ఏయూ యూనివర్సిటీ విద్యార్థులు వైసీపీ నేతల దోపిడీపై గళమెత్తాలన్నారు.

ఇక్కడి ఎంపీ సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజలు నీకు ఓటు వేసి గెలిపిస్తే… ఇక్కడి నుండి పారిపోతావా? అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ప్రశ్నించారు. ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. నీకు చేతకాకుంటే రాజీనామా చెయ్.. మళ్లీ ఎన్నికలు వస్తాయి.. అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. నీ అక్రమాలను, ఉత్తరాంధ్ర దోపిడీని మేం బయటకు తెస్తామని ఎంపీని హెచ్చరించారు. దేవాలయ, చర్చి, మసీదు ఆస్తులను దోచేశారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నారు పవన్‌ కల్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version