హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. పాకిస్థాన్ దేశంలోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నామని కానీ మన రాష్ట్రంలో దేవతా విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నామని అనంరు. దేవుడిపై భారం వేయడం ముఖ్యమంత్రి ఉదాసీనతను తెలియచేస్తోందని పవన్ అనంరు. రాష్ట్రంలో దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారని ఈ పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బ తీసే ఘటనతో ఆవేదనకు లోనయ్యానని అన్నారు. రామతీర్థం క్షేత్రంలో కోదండ రాముని విగ్రహాన్ని పగలగొట్టడం, అంతకు ముందు పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలపెట్టడం చూస్తుంటే ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు తెగబడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించే సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.