మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు ఎప్పుడూ కూడా వారి సొంత ఆలోచనలు ఉంటాయని అన్నారు. “వారు రాజకీయ నాయకులు కాదు, కొందరికి కొన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి, కొందరు నాకు మద్దతుగా ఉండి ఉంటారు… కాపోతే వారు బయటికి రాకపోవడానికి కారణం ఒక్కటే… వారు నాకు మద్దతుగా ఏదైనా మాట్లాడితే వారిపై వైసీపీ కక్ష సాధింపులకు దిగుతుంది… అందుకే వారు బయటికి రావడంలేదు” అని వివరించారు.
అంతే కాక, నాలుగో విడత వారాహి యాత్ర సక్సెస్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో సమస్యలు తనకెంతో బాధ కలిగించినట్లు పవన్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు మార్పు అంశం తీవ్రంగా బాధించిందన్నారు. అలాగే బందరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని నడిపించే అఖిలభారత సర్వీసు అధికారులకు కూడా నెల దాటినా జీతాలు రావడం లేదన్నారు. మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తనకు పెన్షన్ కూడా సకాలంలో రావడం లేదన్నారు.