గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో నేడు అధికారులు కూల్చివేతల పర్వం మొదలుపెట్టారు. గ్రామంలో స్థానికులు కోరుకోకపోయినా రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలకు దిగారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని అరెస్టు చేశారు. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలోకి వచ్చే
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గతంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభకు తమ గ్రామంలో స్థలం ఇచ్చేలా అక్కడివారిని జనసేన నేతలు ఒప్పించారు.
దీనికి ప్రతిఫలంగా ఆ సభలోనే పవన్ కళ్యాణ్ ఆ గ్రామ అభివృద్ధికి 50 లక్షల సాయం ప్రకటించారు. అయితే ఇప్పుడు తమకు స్థలం ఇచ్చారనే కూల్చివేతలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రేపు జనసేనాని ఇప్పటం గ్రామానికి రానున్నారు. నేడు రాత్రికి మంగళగిరి చేరుకొని, రేపు ఉదయం ఇప్పటం గ్రామ ప్రజలను కలుస్తారని వెల్లడించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో ఇళ్ళను కూలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు నాదెండ్ల మనోహర్.