ఏపీలోని కాకినాడ జిల్లా తాళ్లరేవు తీరప్రాంతంలో తాబేళ్ల కళేబరాలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉండే మత్స్య కారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని వారు వెల్లడించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాల అంశం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో దీనిపై అధ్యయనం చేసి కారకులను శిక్షించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
తాబేళ్ల నోట్లో నుంచి నురగలు గక్కుతున్నట్లు ఉన్న వీడియో విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ స్థాయిలో ఉన్న తాబేళ్లు మృతి చెందడంతో తీర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రకృతి ప్రేమికులు సైతం తాబేళ్ల మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై విచారణ జరిపి కారకులకు శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.