రాజకీయాల్లో మర్రి వృక్షంగా బీజేపీకి పేరుంది. తాను ఎదగడమే తప్ప.. తన మిత్రులను ఎదగనివ్వని పార్టీగా ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలోనూ ఆ పార్టీకి పేరుండడం గమనార్హం. తన మిత్రులను అడ్డు పెట్టుకుని తను ఎదగడంలో బీజేపీని మించిన పార్టీ మరొకటి ఉండదు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో జేడీ యూ నేత నితీశ్‌తో పొత్తు పెట్టుకుని.. తను ఎదిగింది. ఇక, ఇప్పుడు ఏపీ వంతు.. ఈ పార్టీ వ్యూహాత్మకం గా పావులు కదుపుతోంది. నిజానికి పార్టీకి ఏపీలో స్థానం లేదు. ఈ క్రమంలోనే బలమైన ప్రజాభిమానం ఉన్న పవన్‌తో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుని.. ఆయన ఇమేజ్‌తో ఎదుగుతోంది.
అయితే..పవన్.. బీజేపీ ట్రాప్‌లో చిక్కుకున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. బీజేపీ వ్యూహంలో చిక్కిన ఆయన తన సిద్ధాంతాలను దాదాపు వదిలేశారు.అంతకు ముందు రాజధాని కోసం.. నిత్యం ఏదో ఒక రూపంలో ఆయన మద్దతు పలికారు. రైతుల కోసం లాంగ్ మార్చ్ చేశారు. రాజధాని ఉద్యమానికి మద్దతుగా అక్కడకు వచ్చి.. ప్రభుత్వ దమన కాండను ప్రశ్నించారు. రాజధాని ఎక్కడికీ పోదని నేనుంటానని అన్నారు.తర్వాత దీనిని వదిలేశారు. ఇటీవల ఏకంగా ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయమే తీసుకోనప్పుడు నేనేం చేస్తానని ప్రశ్నించారు.
పార్టీబలోపేతాన్ని కూడా పవన్ అటక ఎక్కించారు. పార్టీ గురించి పట్టించుకోవడం మానేసి సినిమాల్లోకి వెళ్లిపోయారు. ఫలితంగా పార్టీ కేడర్ ఎక్కడికక్కడ నిరాశలో కూరుకుపోయింది. కీలక నేతలు లక్ష్మీనారా యణ వంటివారుపార్టీకి దూరమయ్యారు. ఇదంతా ఓ వ్యూహం ప్రకారం బీజేపీ చేస్తోందన్న విషయాన్ని పవన్ గ్రహించలేక పోతున్నారనేది విశ్లేషకుల భావన. ఇవన్నీ ఇలా ఉంటే.. బీజేపీ పవన్ మద్దతుతో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆయనను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది. మొత్తంగా చూ్స్తే.. ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవకపోతే.. మొత్తానికే నష్టం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.