టాలీవుడ్‌ లో విశ్వనాథ్ స్థానం భర్తీ చేయలేనిది – పవన్‌ కళ్యాణ్‌

-

టాలీవుడ్‌ లో విశ్వనాథ్ స్థానం భర్తీ చేయలేనిదన్నారు పవన్‌ కళ్యాణ్‌. కళా తపస్వి చిత్రాలు… వెండి తెరపై మెరిసిన స్వర్ణ కమలాలు అని పేర్కొన్నారు పవన్‌. తెలుగు సినిమా స్థాయినీ… తెలుగు దర్శకుల సృజనాత్మకతనీ ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట శ్రీ కె.విశ్వనాథ్ గారు శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు.


శ్రీ విశ్వనాథ్ గారితో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం ఉంది. అన్నయ్య చిరంజీవి గారితో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలు తీసినప్పటి నుంచి శ్రీ విశ్వనాథ్ గారు తెలుసు. వారిని ఎప్పుడు కలిసినా తపస్సంపన్నుడైన జ్ఞాని మన కళ్ల ముందు ఉన్నట్లే అనిపించేది. భారతీయ సంస్కృతిలో భాగమైన సంగీతం, నృత్యాలను తన కథల్లో పాత్రలుగా చేసి తెరపై ఆవిష్కరించిన ద్రష్ట శ్రీ విశ్వనాథ్ గారు. ఇందుకు ఆయన తీసిన ‘శంకరాభరణం’, ‘సిరిసిరి మువ్వ’, ‘స్వర్ణ కమలం’, ‘సాగర సంగమం’, ‘సిరివెన్నెల’ లాంటివి కొన్ని మచ్చుతునకలు అన్నారు.

‘శారద’, ‘నేరము శిక్ష’, ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘ఓ సీత కథ’, ‘స్వాతిముత్యం’, ‘సీతామాలక్ష్మి’ లాంటి చిత్రాల్లో మన జీవితాలను, మనకు పరిచయం ఉన్న మనస్తత్వాలను చూపించారు. కాబట్టే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన్ని గుండెల్లోపెట్టుకున్నారు. ‘కళా తపస్వి’గా ప్రేక్షకుల మన్ననలు పొందిన విశ్వనాథ్ గారి చిత్రాలు తెలుగు తెరపై స్వర్ణ కమలాలుగా మెరిశాయి. నటుడిగా ఆయన పోషించిన పాత్రలు సినిమాలకు నిండుదనాన్ని తీసుకువచ్చాయి. తెలుగు సినిమా కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేసిన శ్రీ విశ్వనాథ్ గారి స్థానం భర్తీ చేయలేనిది. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version