కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడంలో రోజుకు 24 గంటలూ కష్టపడి, ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్న డాక్టర్లకు మద్దతుగా చప్పట్లు కొట్టాం. వారి బాగు కోసం దీపాలు వెలిగించాం. కానీ అలా చేయమని పిలుపు ఇచ్చిన ప్రభుత్వాలు మాత్రం వారికి జీతాలను సరిగ్గా చెల్లించడం లేదు. ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ హాస్పిటల్ వైద్యులు 3 నెలలుగా జీతాలు అందక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు వెంటనే జీతాలు చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆ హాస్పిటల్‌లో వైద్యులకు గత 3 నెలలుగా జీతాలు లేవు. సాధారణంగా ఆ హాస్పిటల్‌లో గతంలోనూ సరిగ్గా వేతనాలు చెల్లించేవారు కాదు. 2 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఆ గడువు దాటిపోయింది. జూన్ 16కు 3 నెలలు పూర్తవుతుంది. అయినా ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 16లోపు జీతాలు చెల్లించాలని లేదంటే తామంతా రాజీనామాలు చేస్తామని వారు ఇదివరకే చెప్పారు. అయినా ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
కాగా మరోవైపు ఆ హాస్పిటల్‌లో గత 60 రోజుల కాలంలో 10 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఓ వైపు తాము ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని ఆ హాస్పిటల్ వైద్యులు అంటున్నారు.