ఏపీలో రాజధాని వికేంద్రీకరణ వ్యవహారం రేపిన చిచ్చు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై విపక్షాలు, రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం కోసం టీడీపీ హయాంలో సేకరించిన 33వేల ఎకరాల భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిజానికి రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేదని అన్నారు. హైదరాబాద్‌లో సచివాలయం, అసెంబ్లీ అంతా కలిపి 200 ఎకరాలేనని చెప్పారు.
ఇక రాజధానుల విషయంలో కేంద్రం అనుమతిపై పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు కాకపోతే 30 రాజధానులు నిర్మించుకుంటామని కేంద్రానికి దానితో ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. మార్చిలో స్థానిక ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. తెలంగాణ తరహాలో ఇంటింటికి తాగునీరు ఇస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. కాగా, మరోవైపు ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.