ఇది కరోనా కష్టకాలం.. మనిషికి మనిషి తోడుగా నిలవాల్సిన సమయం.. చుట్టూ ఉన్న సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన సందర్భం.. కరోనా మహమ్మారి నుంచి మనకు మనం రక్షణ కల్పించుకుంటూనే.. తోటి వారికి మనకు చేతనైనంత సహాయం చేయాలి. అయితే ఇలా చేయకపోయినా ఎవరూ ఏమీ అడగరు. కానీ కనీసం మనుషులుగానైనా ప్రవర్తించాలి కదా.. కొంచమైనా బుద్ధి, జ్ఞానం అనేవి ఉండాలి. పరుల సొమ్ము పాములాంటిది.. అనే సత్యాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి. కానీ.. చూడబోతే ఆ ప్రాంత వాసులకు అవేవీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఓ పేదవాడు బండిపై అమ్మకానికి పెట్టిన మామిడికాయలను గుంపులుగా ఎగబడి దొంగిలించారు. ఏమాత్రం సిగ్గు లేకుండా.. నీచమైన మనుషుల్లా ప్రవర్తించారు.
ఢిల్లీలోని జగత్‌పురి ఏరియాలో ఛోటే అనే వ్యక్తి రోడ్డుపై బండ్ల మీద మామిడికాయలను అమ్మసాగాడు. పోలీసులు బండ్లను అక్కడి నుంచి తీసేయాలని అనడంతో.. వారితో మాట్లాడేందుకు అతను వెళ్లాడు. ఆ సమయంలో బండ్ల దగ్గర ఎవరూ లేనిది చూసి కొందరు ప్రబుద్ధులు ఎగబడి మరీ మామిడికాయలను చోరీ చేశారు. గుంపులుగా వచ్చి సంచులు, హెల్మెట్లలో ఆ పండ్లను నింపుకుని.. ఎంచక్కా.. దర్జాగా.. తామేదో ఆ పండ్లను కొనుగోలు చేసినట్లు.. తమ కోసం ఆ పండ్లను అక్కడ పెట్టినట్లు ప్రవర్తిస్తూ.. వాటిని దొంగిలించుకుపోయారు. దీంతో తరువాత వచ్చి చూసిన ఆ వ్యక్తికి దిమ్మ తిరిగింది. తాను అమ్మడానికి పెట్టిన మామిడి పండ్లను జనాలు అలా దొంగిలించారని తెలుసుకుని అతను కన్నీరుమున్నీరయ్యాడు. వాటి విలువ రూ.30వేల ఉంటుందని, తనకు న్యాయం చేయాలని కోరాడు.
అవును.. నిజంగా సమాజంలో కొందరికి అసలు నైతిక విలువలు అంటూ లేకుండా పోయాయి. అందుకే కాబోలు.. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. ఇలాంటి వెధవలు ఉన్నంత కాలం దేశం బాగుపడదు.