మహారాష్ట్రలోని ఓ ఏటీఎం దగ్గర వినియోగదారులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. నాగ్‌పూర్ జిల్లా ఖాపర్‌ఖేడా పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఓ వ్యక్తి ఏటీఎంలో నుంచి రూ.500 విత్‌డ్రా చేశాడు. అయితే రూ.500కు బదులు రూ.2500 వచ్చాయి. దీంతో స్థానికంగా ఈ వార్త వైరల్ అయింది. ఈ విషయం అందరికీ తెలియడంతో భారీ స్థాయిలో జనాలు ఎగబడ్డారు.
బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడానికి స్థానికులు పెద్ద ఎత్తున ఏటీఎం వద్ద గుమిగూడారు. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారుల్లో ఒకరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను మూసివేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, రూ.100 విలువైన నోట్లను ఉంచాల్సిన ట్రేలో తప్పుగా రూ.500 నోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బ్యాంకు అధికారులు డబ్బులు ఎవరెవరు ఎంత మొత్తంలో నగదు తీసుకున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.