జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేనాని పవన్ తీరును ప్రశ్నిస్తూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట మార్చడంలో పవన్ కల్యాణ్ ను మించిన వారు లేరన్న పేర్ని… మాట మార్చే వారికి ఐకాన్ గా పవన్ నిలిచారని ఎద్దేవా చేశారు. 2014లో టీడీపీకి ఓటేయాలన్న పవన్… 2019లో టీడీపీకి ఓటేయవద్దని చెప్పారని గుర్తు చేశారు పేర్ని నాని. 2014లో బీజేపీకి ఓటేయన్న పవన్… 2019లో బీజేపీకి ఓటేయవద్దని చెప్పారని కూడా ఆయన గుర్తు చేశారు.
రాజధాని అమరావతిపైనా మాట మార్చడం పవన్ కు మాత్రమే చెల్లిందని పేర్ని నాని విమర్శించారు. పవన్ మాటలకు నీటి మీద రాతలకు ఏమాత్రం తేడా లేదని కూడా ఆరోపించారు పేర్ని నాని. విశాఖ ఎయిర్ పోర్టులో ఇద్దరు మహిళా మంత్రులు, ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు, ఓ దళిత మంత్రిపై దాడికి దిగిన తన పార్టీ కార్యకర్తలను మందలించాల్సిన పవన్…
వారిని వెనకేసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు పేర్ని నాని. దళిత మంత్రిపై చెప్పులేయిస్తారా? అని ప్రశ్నించిన నాని… మహిళా మంత్రులను అసభ్య పదజాలంతో తిట్టిస్తారా? అని నిలదీశారన్నారు. అయినా పవన్ కు స్వాగతం చెప్పేందుకు జెండా కర్రలతో రావాల్సిన జనసేన కార్యకర్తలు…దాడులు చేసే కర్రలకు జెండాలు కట్టుకుని ఎలా వచ్చారని పేర్ని నాని ప్రశ్నించారు.