మన పురాణాల ప్రకారం.. పీరియడ్స్ అంటేనే అదొక అపచారం లెక్క ఇంకా చూస్తున్న రోజుల్లో.. ఇప్పుడు అది ఓ బ్యూటీ ట్రెండ్ అయింది. దీని గురించి తెలుసుకోవాలని చాలా మంది మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే.. పీరియడ్ బ్లడ్ ఫేస్ మాస్క్ ప్రస్తుతం బ్యూటీ ట్రెండ్లలో అగ్రస్థానంలో ఉంది. #periodfacemask హ్యాష్‌ట్యాగ్ తో ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
పేరు తగ్గట్లుగానే.. ఇది మీ సొంత పీరియడ్స్ రక్తంతో తయారు చేసే ఫేస్ మాస్క్. చాలా మంది యువతులు దీనితో DIY ఫేస్ మాస్క్ చేసి.. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరికి దీనిని ప్రయత్నించడం ప్రయోగాత్మకంగా ఉంటే.. మరికొందరు పీరియడ్ ఫేస్ మాస్క్‌ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. ఇంతకీ ఈ పీరియడ్ ఫేస్ మాస్క్‌లు నిజంగా పనిచేస్తాయో లేదో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఎలా చేస్తారో చూడండి..
మీ పీరియడ్ బ్లడ్‌ని సేకరించి ఒక కంటైనర్‌లో ఉంచండి. దానిని మీ ముఖమంతా పూయండి. ఇది అపరిశుభ్రంగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ మెరుసే చర్మం పొందాలనే ఆశతో చాలామంది ఈ బ్లడ్‌ని ఫేస్ మాస్క్‌గా వేసుకుంటున్నారు. కానీ ఈ విచిత్రమైన బ్యూటీ ట్రెండ్‌ని ప్రయత్నించడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
పీరియడ్ బ్లడ్‌ను ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం అంత సురక్షితం కాదు అంటున్నారు నిపుణులు. మెరిసే చర్మం గురించి పక్కన పెడితే.. ఇది చర్మ వ్యాధులకు దారితీయవచ్చు అంటున్నారు. ప్రత్యేకించి మీకు ఇప్పటికే యోని లేదా గర్భాశయ సంక్రమణం ఉన్నట్లయితే ఇది ప్రమాదకరమైనదని కూడా కొందరు చూస్తున్నారు.
వాంపైర్ ఫేషియల్ కూడా బ్లడ్తో చేస్తారు కానీ.. పీరియడ్ బ్లడ్తో కాదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. ఈ వాంపైర్ ఫేషియల్ ముడతలను తగ్గిస్తుంది. వాడిపోయిన చర్మాన్ని బొద్దుగా చేస్తుంది. అంతేకాకుండా ఇది మీ ఛాయను మెరుగుపరిచి.. మొటిమలను తగ్గిస్తుంది. అయితే వాంపైర్ ఫేషియల్, పీరియడ్ ఫేస్ ప్యాక్ ఒకే విధమైన ఫలితాలను ఇవ్వవు అని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు ఇలాంటివి కాకుండా వేరేవి ట్రై చెయ్యండి అంటూ సలహా ఇస్తున్నారు..