వేసవి పంటగా పెసర, మినప సాగు మేలేనా? ..రకాలు, విత్తే పద్దతులు ఇవే..!  

-

వేసవిలో పండించే పంటల్లో పెసర, మినుముకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తక్కువ కాలపరిమితిలోనే 2-3 తడులతో పంట చేతకొచ్చేస్తుంది. కృష్ణా- గోదావరి డెల్టా ప్రాంతాల్లో వరి తర్వాత మాగాణుల్లో మిగిలిన తేమ, పోషకాలను వినియోగించుకొని పండించే పంటల్లో మినుము, పెసర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. సరైన రకాలు ఎన్నుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు పొందటానికి వీలవుతుంది. ఈరోజు పెసర, మినపలో ఎలాంటి రకాల విత్తనాలు ఎంచుకోవాలి, కలుపు నివారణకు ఎలాంటి మందులు వాడాలి ఇవన్నీ చూద్దాం.
తేలిక నేలలు పెసరకు, బరువైన నేలలు మినుముకు అనుకూలం. చౌడు నేలలు, మురుగునీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటలకు పనికిరావు.

పెసరలో రకాలు:

పెసరలో 60-70 రోజుల కాలపరిమితి కలిగి ఎకరాకు 4-6 క్వింటాళ్ల దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎల్.జి.జి-407, ఎల్.జి.జి-460, ఎల్.జి.జి-450, ఎల్.జి.జి-10, 3. Do-96-2, డబ్ల్యు.జి.జి-42, ఐ. పి. ఎం-2-14, డబ్ల్యూ. జి. జి-37 రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
పల్లాకు తెగులు ప్రధాన సమస్యగా ఉంది కనుక ఈ తెగులును తట్టుకునే రకాలను వేసుకోవాలి. డబ్ల్యు.జి.జి-42, 37 రకాలు పల్లాకు తెగులును తట్టుకుంటాయి. అంతేగాక లాంఫారమ్ నుంచి పల్లాకు తెగులును తట్టుకునే ఎల్.జి.జి-607, ఎల్.జి.జి-630 రకాలు చిరుసంచుల దశలో ఉన్నాయి.

మినుములు రకాలు:

మినుములో 75-80 రోజుల కాలపరిమితి కలిగి ఎకరాకు 8-12 క్వింటాళ్ల దిగుబడినిచ్చే రకాలు మార్కెట్లో ఉన్నాయి. మినుములో ఎల్.బి.జి-787, ఎల్.బి.జి-752, పి. యు-31, పల్లాకు తెగులును తట్టుకునే టి.బి.జి-104, జి.బి.జి-1 రకాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని పల్లాకు తెగులును తట్టుకునే రకాలైన ఎల్.బి.జి-884, ఎల్.బి.జి-904, ఎల్.బి.జి-932, టి.బి.జి-129, జి.బి.జి-45 రకాలు ఉన్నాయి.

ఎప్పుడు విత్తుకోవాలి?

ఫిబ్రవరి- మార్చిలో విత్తుకోవాలి. ఒకసారి నాగలితో, రెండుసార్లు గొర్రు, గుంటకతో దున్ని పొలాన్ని తయారు చేసుకోవాలి. వరి మాగాణుల్లో ఎటువంటి దుక్కి అవసరం లేదు.
వరి మాగాణుల్లో అయితే ఎకరాకు 10-12 కిలోల పెసర, 16-18 కిలోల మినుము విత్తనాలను వరి కోతకు 2-3 రోజుల ముందు పొలంలో వెదజల్లుకోవాలి.మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు పెసర 6-7 కిలోలు, మినుము 10-12 కిలోల విత్తనం వరుసల మధ్య 22.5 సెం.మీ., వరుసల్లో మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో గొర్రుతో ఎదబెట్టితే తగిన మొక్కల సాంద్రత కలిగి అధిక దిగుబడులు వస్తాయి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రసంపీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి. విత్తనశుద్ధి చేసుకుంటే 20-25 రోజుల వరకు తక్కువ ఖర్చుతో పంటను చీడపీడల నుంచి రక్షించడానికి వీలవుతుంది. కిలో విత్తనానికి 2.5 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా మాంకోజెబ్ లేదా కార్బెండాజిమ్ అనే తెగుళ్ల మందుతో తర్వాత 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సామ్ పురుగు మందుతో కలిపి విత్తనశుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

తెలంగాణలో అయితే ఏ రకం వాడాలి?

ప్రధాన పంటలైన పత్తి, మొక్కజొన్న, వేరుసెనగ, పసుపు, ఇతరత్రా పంటల తర్వాత బోరుబావుల కింద 4-5 నీటితడులిచ్చే అవకాశముంటే పెసర లేదా మినుము పండించవచ్చు. సకాలంలో విత్తితే పూత, పిందె దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట దెబ్బతినకుండా మంచి దిగుబడులు సాధించవచ్చు. పెసరలో డబ్ల్యు.జి.జి-42, ఎం.జి.జి-295, ఎం.జి.జి-347, ఎం.జి.జి-351, టి. ఎం-96-2 రకాలు; మినుములో పి.యు-31, ఎల్.బి.జి-752, ఎల్.బి.జి-787, టి.బి.జి-104 రకాలు వేసవికి అనువైనవి. సమస్యాత్మక ప్రాంతాల్లో పల్లాకు తెగులును తట్టుకునే డబు, జి.జి-42, యం.జి.జి.-351 పెసర రకాలను సాగు చేయాలి. అలాగే పి.యు-31, ఎల్.బి.జి-787, టి.బి.జి-104 మినుము రకాలను సాగు చేయాలి.

మొదటిసారి విత్తుతుంటే..

నేలలో మొదటిసారిగా పెసర, మినుము వేస్తున్నట్లయితే ఎకరాకు సరిపడా విత్తనానికి 200 గ్రా, రైజోబియం కల్చరు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకుంటే గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించడం వల్ల నేల సారవంతమవుతుంది.

ఎరువుల యాజమాన్యం

ఎరువు వేసి కలియదున్నితే నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత విత్తే ముందు ఎకరాకు 18 కిలోల యూరియా (8 కిలోల నత్రజని), 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (20 కిలోల భాస్వరం) వేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయటం వల్ల అదనంగా గంధకం, కాల్షియం మొక్కలకు అందుబాటులోకి వస్తుంది.
పైపాటుగా పెసరకు 20-30, 40-45 రోజుల దశలో, మినుముకు 35-40, 55-65 రోజుల దశలో ఎకరాకు కిలో 19:19:19 మొదటిసారి, ఒక కిలో 13-0-45 రెండోసారి పిచికారి చేస్తే 15-20 శాతం దిగుబడులు పెరుగుతాయి. వరి మాగాణుల్లో ఎటువంటి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
నీటి తడులు నేల స్వభావాన్ని బట్టి 10-15 రోజుల వ్యవధిలో 3-4 తడులు ఇవ్వాలి. పూత దశలో నీటితడి ఇస్తే పూత రాలిపోతుంది. మొగ్గ, కాయ ఏర్పడే దశలు, గింజ కట్టే దశలు నీటికి సున్నిత దశలు గనుక ఈ దశల్లో పంట బెట్టకు గురి కాకుండా రైతులు చూసుకోవాలి.

కలుపు నివారణ

కలుపు నివారణ విత్తిన 20-25 రోజుల తర్వాత గొర్రుతో చేసుకోవచ్చు. రసాయనాలతో కలుపు నివారణ చేయాల్సినప్పుడు విత్తిన వెంటనే పెండిమిథాలిన్ ఎకరాకు 1-1.3 లీటర్లు లేదా అలాక్లోర్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తే 20 రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది. తర్వాత 20-25 రోజులప్పుడు కలుపు 2-3 ఆకుల దశలో ఎకరాకు 200 మి.లీ. ఇమాజితాఫిర్ లేదా 300 మి. లీ. అసిఫ్లోరోఫెన్ + క్లోరిన్ఫాప్ ప్రొపార్టెల్ మందులను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసి అన్ని రకాల కలుపు నివారించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version