దేశంలో రోజు రోజుకీ పెట్రో మంటలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించేది లేదని చెబుతోంది. కాగా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా ఇంధన ధరలను తగ్గించి ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చెప్పారు. అయితే ఇప్పుడు ఏపీ కోవలోకి పశ్చిమ బెంగాల్ కూడా వచ్చి చేరింది.
పశ్చిమబెంగాల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను రూ.1 మేర తగ్గించినట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఇవాళ వెల్లడించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ… పెట్రోల్, డీజిల్ ధరలను రూ.1 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆమె కోరారు.
గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 9 సార్లు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిందని సీఎం మమత అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్రం ఇంధన ధరలను తగ్గించకపోవడం దారుణమని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ లేదా సెస్‌ను అస్సలు పెంచలేదని మమత తెలిపారు. కనుక వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్‌ను తగ్గించాలని మమత డిమాండ్ చేశారు.