డిసెంబర్ 8వ తేదీన ప్రారంభమైన పోలీసు ఉద్యోగ నియామకాల్లోని ఫిజికల్ ఈవెంట్స్ పూర్తయ్యాయి. రెండు లక్షల మందికి పైగా ఈ పరీక్షల్లో పాల్గొనగా, లక్షా11 వేల మంది అర్హత సాధించారు. మొత్తం 53.07శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలు సులభతరం చేయడం వల్ల గతసారితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.
మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు తుది రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 554 ఎస్సై పోస్టులకు 52వేల 786 మంది పోటీ పడనున్నారు. 15వేల 644 కానిస్టేబుల్ పోస్టులకు 90 వేల488 అభ్యర్థులు… 614 ఆబ్కారీ కానిస్టేబుళ్లకు 59వేల 325 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నిర్దేశించిన అర్హత కంటే అధిక విద్యార్హత కలిగిన అభ్యర్థులు సైతం పలు పోస్టులకు పోటీ పడుతున్నట్లు ఛైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు.