రాజకీయం ఆశించకుండా, రాజకీయం చేయకుండా కేసీఆర్ స్టేట్మెంట్లు ఉండవు. కాదనం కానీ ఆ రాజకీయ శక్తి ఇటీవల తాను ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ని అదే పనిగా తిట్టడం బాలేదన్న వాదన కూడా ఉంది. దేశ వ్యాప్తంగా సాగు చట్టాల విషయమై ఎవరు ఏం మాట్లాడినా ఇప్పుడవి రద్దయి ఉన్నాయి. వాటిపై మళ్లీ మళ్లీ మాట్లాడినా సాధించేదేమీ ఉండదు. సాగు చట్టాలపై మొదట నుంచి వ్యతిరేకతతో ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఉద్యమం కాదది. కేవలం ఆ రెండు రాష్ట్రాలే (పంజాబ్ మరియు హర్యానా) ఎక్కువగా వ్యతిరేకించాయి. సాగు చట్టాలకు సంబంధించి ఒకవేళ హైద్రాబాద్ కేంద్రంగా ఏమయినా ఉద్యమం జరిగినా అందుకు ఆ రోజు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన దాఖలాలే లేవు.
దీంతో కేసీఆర్ ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడు ఏ విధంగా ఉన్నారు అన్నవి స్పష్టం అయి ఉన్నాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా అంటున్నారు కానీ వాటిలో సహేతుకత ఎంతన్నది ఆయనే తెలుసుకోవాలి. వ్యవసాయ మోటార్లు మీటర్లు బిగింపు విషయమై ఇప్పుడిప్పుడే వ్యతిరేకం పెరిగిపోతున్న వేళ వాటిని తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకునేందుకు కేంద్రంతో కయ్యం పెట్టుకుంటున్నారన్నది విపక్షం మాట. అదేవిధంగా కొన్ని విషయాల్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు అన్నీ రాజకీయ ప్రయోజనం ఆశించేవే కానీ ప్రజా ప్రయోజనం అన్నది ఇందులో పెద్దగా లేదు. ఈ నేపథ్యాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్లీ వివాదంలో ఇరుక్కున్నారు.
దేశంలోనే ఆదర్శనీయ పాలనను తాము అందిస్తున్నామని ఆయన చెబుతున్నా, వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా నిన్న మొన్నటి వేళల్లో ఆయన చేపట్టిన పర్యటన, చండీఘడ్ కు పోయి రైతు కుటుంబాలకు ఆర్థిక ఊతం ఇచ్చిన వైనంపై కొన్ని విమర్శలు రేగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రంపై ఆయన చేసిన విమర్శలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తీవ్ర చర్చకు తావిస్తున్నాయి.కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులు అవుతారా అని నిన్నటి వేళ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే మాట ఆయనకూ వర్తిస్తుందని సోషల్ మీడియా యాక్టివిస్ట్ రఘు భువనగిరి అంటున్నారు. మరి! తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులు అవుతారా? ఆ పాటి దానికే ఆయనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ధర్నా చౌక్ రద్దు చేసేస్తారా అని కూడా ఇంకొందరు ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుల కోసం మాట్లాడితే కేంద్రానికి నచ్చదు అని ఎలా అంటారు. అనాలోచిత నిర్ణయాలు కాకుండా వారికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటే ఎవ్వరు కేసీఆర్ ను అడ్డుకుంటారు ? పంజాబ్ తరహా ఉద్యమాలు దేశమంతా రావాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు కానీ ఇక్కడ రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకు కేసీఆర్ తీసుకున్న చర్యలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయో కూడా క్షేత్ర స్థాయిలో సంబంధిత వివరం తెలుసుకోవాలని చెబుతున్నారు ఇంకొందరు