తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్ని ప్రకటన రూపంలో చెప్పేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాబినెట్ భేటీ అయ్యాక.. సీఎం జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్లు గడువు ఉన్నప్పటికి.. అందుకు ముందే సిద్ధం కావాలన్న స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అన్నింటికి మించి వచ్చే ఏడాది నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీం రంగంలోకి దిగుతుందన్న మాట విస్మయానికి గురి చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు కూడా పీకే టీం రంగంలోకి దిగటం.. వ్యూహాత్మకంగా ప్రజల్లో చర్చను తీసుకొచ్చి.. జగన్ సాధించిన ఘన విజయంలో కీలకభూమిక పోషించారని చెప్పడం తెలిసిందే!
అయితే… అప్పుడు వైఎస్ జగన్ కు పీకే తోడైనా.. సోషల్ మీడియా టీంస్ తోడైనా.. పాటలు వినిపించినా – యాత్రలు చేసినా అది వేరు! అప్పటివరకూ తన పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు కాబట్టి… జగన్ అధికారంలోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, అందుకు ఎంతమంది సహకారం తీసుకున్నా, ఎన్ని పీకే టీం లాంటివి పనిచేసినా… అందులో అర్థం ఉంది!
అయితే… 2019 ఎన్నికల్లో జగన్ ను పూర్తిగా నమ్మిన జనం క్లియర్ మెండేట్ ఇచ్చారు. ఐదేళ్లు పాలించమని చెప్పారు. అయితే… జగన్ తన పాలన రెండున్నరేళ్లు పూర్తయ్యిందో లేదో.. అప్పుడే పీకే లాంటి పొలిటికల్ వ్యూహకర్తల సహాయం అడుగుతున్నారంటే… అది కచ్చితంగా జగన్ వైఫల్యమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
2024 ఎన్నికలు జరిగినా.. కాస్త ముందస్తుగా జరిగినా కూడా ఆ ఎన్నికల్లో జగన్ ధైర్యం గా ముందుకుపోవాలి. తన పాలనకు రెఫరేండం ఇవ్వాలని ప్రజలను అడగాలి. తన పాలన నచ్చితే ఓట్లు వేయాలని సూటిగా చెప్పగలగాలి. అప్పుడు జగన్ గొప్పవ్యక్తి అవుతారు.. గొప్ప నాయకుడు అవుతారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటారు.
అంతేకానీ… అధికారం ఇచ్చిన తర్వాత, ప్రజలను ఇంతకాలం పాలించిన తర్వాత… తనపాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని తానే చెబుతున్న తర్వాత కూడా… పీకే సహాయం అర్ధిస్తున్నారంటే… అంతకుమించిన చేతకానితనపు చేష్ట మరొకటి ఉండదనే మాట వెళ్లబుచ్చుతున్నారు విశ్లేషకులు!
మరి వస్తున్న వార్తల నేపథ్యంలో… నిజంగా జగన్ రాబోయే ఎన్నికల్లో కూడా పీకే సహాయమే తీసుకుంటారా? తన పాలనలో పస లేదు.. అందుకోసం పీకే అవసరం ఉంది అని చెప్పుకుంటారా? లేక, ప్రజలకు – జగన్ కు మధ్య ఎవరూ అవసరం లేదని నికార్సుగా నిలబడతారా అన్నది వేచి చూడాలి!
– CH Raja