తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన మీద తమకు అనుమానాలున్నాయని బీజీపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందించారు. మీరు ప్రధాని మోడీ వద్ద సమయం ఇప్పిస్తారా? అంటూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో చేపట్టిన కులగణన మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
డెడికేటెడ్ కమిషన్ వేసుకొని లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో పారదర్శకంగా సర్వే చేపట్టామని, మహారాష్ట్రలో బీసీ కులగణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారని, బిహార్‌లో కులగణన చేపట్టి ఆ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే (RJD, JDU) ఆర్జేడీ, జేడీయూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని మంత్రి పొన్నం ఆరోపించారు. జార్ఖండ్‌లో బీసీల రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం పెట్టగానే తప్పుడు కేసులతో సీఎం హేమంత్ సోరెన్‌ను జైల్లో వేశారని.. అలాంటి చరిత్ర బీజేపీదని కె. లక్ష్మణ్‌ను ఉద్దేశించి మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు చేశారు.