ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు వెనుక నుండి ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారు మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకటేష్, అన్వేష్‌లకు తీవ్రగాయాలవగా వారిని అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్ అప్పటికే వెంకటేష్ మృతి చెందాడని ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, మృతుడి బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు.