ఔటర్ రింగ్ రోడ్డు (ఓఅర్అర్) బాధితులకు తీపి కబురు చెప్పింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ (ఓఅర్అర్). ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా స్థలాలు (ప్లాట్లు) లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతుంది హెచ్ఎండిఎ. అందులో భాగంగా బుధవారం 15వ తేదీన 17 మంది బాధితులకు ప్లాట్ల కేటాయింపులు జరిపేందుకు హెచ్ఎండిఎ నిర్ణయించింది.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పిడి), ఓఆర్ఆర్ ప్రాజెక్ట్(ఆర్అండ్ఆర్) స్పెషల్ కలెక్టర్ సంతోష్ ఐఏఎస్ మరియు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ (ఆర్అండ్ఆర్) స్పెషల్ ఆఫీసర్, బి.అపర్ణ ఆధ్వర్యంలో బుధవారం (15న) ఉదయం నానక్ రామ్ గూడా లోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్.జి.సి.ఎల్) కార్యాలయంలో ప్లాట్ల కేటాయింపులో ప్రక్రియ జరగనున్నది.
జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ – 14, 2006 ప్రకారం 160 మంది ఓఆర్ఆర్ బాధిత కుటుంబాలు ఉండగా వారిలో ఇప్పటికే 133 మందికి ప్లాట్ల కేటాయింపులు జరిగాయి. మిగిలిన 27 మంది బాధితుల్లో 17 మందికి బుధవారం లాటరీ పద్ధతిన ప్లాట్ల కేటాయింపులో జరుగుతాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలో అందుబాటులో ఉన్న 17 ప్లాట్ లను ఓఆర్ఆర్ బాధిత కుటుంబాలకు లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేయనున్నారు.