ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలో జన్‌ధన్ అకౌంట్లు ఉన్న మహిళలకు తడవకు రూ.500 చొప్పున ఇప్పటి వరకు మొత్తం రూ.1000 ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 20.4 కోట్ల మంది మహిళలకు మోదీ ప్రభుత్వం నగదును అందజేసింది. ఇక మూడో విడతలో భాగంగా శుక్రవారం నుంచి మరోమారు మహిళలకు ఒక్కొక్కరికి రూ.500 నగదును బదిలీ చేయనున్నారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు చేయూతను అందించేందుకు కేంద్రం ఈ పథకంలో భాగంగా నగదును బదిలీ చేస్తోంది.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మూడో విడత నగదు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో అకౌంట్ నంబర్ల ప్రకారం విడతల వారీగా ఈ దఫా నగదు.. మహిళల జన్‌ధన్ ఖాతాలకు బదిలీ కానుంది.
* మహిళల జన్‌ధన్ అకౌంట్ నంబర్లలో చివర 0 లేదా 1 అంకె ఉంటే వారికి జూన్ 5న నగదు జమ అవుతుంది.
* అకౌంట్ నంబర్లలో చివర 2 లేదా 3 అంకె ఉంటే జూన్ 6న నగదు జమ అవుతుంది.
* అకౌంట్ నంబర్ల చివర 4 లేదా 5 అంకె ఉంటే వారికి జూన్ 8న నగదు జమ చేస్తారు.
* అకౌంట్ నంబర్ల చివర 6 లేదా 7 అంకె ఉన్నవారికి జూన్ 9 నగదు జమ అవుతుంది.
* అకౌంట్ నంబర్ చివర 8 లేదా 9 అంకె ఉంటే వారికి జూన్ 10న డబ్బులు జమ అవుతాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమయ్యే ఈ నగదు బదిలీ జూన్ 10వ తేదీతో ముగియనుంది. అయితే గతంలో ఈ నగదు కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఏటీఎంల వద్ద బారులు తీరారు. దీంతో ఆ రద్దీని తగ్గించేందుకు ఇప్పుడు 5 రోజుల్లో 5 దఫాలుగా నగదును ఆయా అకౌంట్లలో జమ చేయనున్నారు.