కరోనా వల్ల పతనమైన భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ఈ ప్యాకేజీని ప్రకటించారు. ”ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట ఈ ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారికి ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తారని.. ప్రధాని మోదీ తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా వ్యవసాయం, కార్మికులు, పేదలు, కూలీలు, వలస కార్మికులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి ఉపయోగం ఉంటుందన్నారు. కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గదని అనేక మంది నిపుణులు చెబుతున్నారని.. అందువల్ల దాంతో మనం సుదీర్ఘకాలం సహజీవనం చేయాల్సి వస్తుందని మోదీ అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటించాలని అన్నారు.