మోదీ అంత దూకుడుగా పాలన కొనసాగించడానికి వెనుక ఉన్న కారణం.. ఆయనకు ప్రధాని అవడం వల్ల వచ్చిన అధికారం కాదు.. నిజానికి మోదీ చిన్నప్పటి నుంచీ అంతే.. ప్రజలకు మంచి చేసేందుకు ఆయన ఎలాంటి నిర్ణయాలను తీసుకునేందుకైనా వెనుకాడరు.
ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ రాజకీయాల్లో ఈయన వేసిన ముద్ర చెరిగిపోలేనిది.. సంచలన నిర్ణయాలను తీసుకోవడంలో మోదీకి పెట్టింది పేరు.. తాను నమ్మిన సిద్దాంతాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. పాటించే తీరుతారీయన. ఎవరు ఏం అన్నా.. ఏం చెప్పినా.. తాను చేసేది చేయక మానరు. ప్రతి పక్ష పార్టీల గుండెల్లో గుబులు పుట్టించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే రాజకీయ చదరంగంలో తనదైన శైలిలో పావులు కదుపుతూ ప్రతి పక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేయడంలోనూ మోదీ దిట్ట అని చెప్పవచ్చు. అయితే మోదీ అంత దూకుడుగా పాలన కొనసాగించడానికి వెనుక ఉన్న కారణం.. ఆయనకు ప్రధాని అవడం వల్ల వచ్చిన అధికారం కాదు.. నిజానికి మోదీ చిన్నప్పటి నుంచీ అంతే.. ప్రజలకు మంచి చేసేందుకు ఆయన ఎలాంటి నిర్ణయాలను తీసుకునేందుకైనా వెనుకాడరు. ఈ క్రమంలోనే నాయకత్వ లక్షణాలు కూడా ఆయనకు రాజకీయాల్లో చేరాక రాలేదు. చిన్నప్పటి నుంచే ఉన్నాయి.
మోదీ 1950వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన బాంబే స్టేట్ (ఇప్పుడు గుజరాత్)లోని వాద్‌నగర్‌లో పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తమ కుటుంబంలో 3వ సంతానం. మోదీ తండ్రి పేరు దామోదర దాస్ ముల్‌చంద్ మోదీ. ఇక మోదీ పూర్తి పేరు.. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. మోదీ తండ్రి టీ స్టాల్ నడిపి కుటుంబాన్ని పోషించేవారు. అయితే మోదీ తన తండ్రికి ఆ స్టాల్‌లో సహకారం అందించేవాడు. ఆ తరువాత అక్కడే సొంతంగా టీ స్టాల్‌ను మోదీ ఏర్పాటు చేసుకుని నడిపాడు. ఇక మోదీ 1967 వరకు వాద్‌నగర్‌లోనే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత 1978లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. ఆ తరువాత 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి డిస్టన్స్‌లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు.
అయితే స్కూల్, కాలేజీ రోజుల్లోనే మోదీ అప్పటి దేశ పరిస్థితులు, రాజకీయాలు, ఇతర అంశాలపై తన తోటి విద్యార్థులతో నిర్వహించే డిబేట్లలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనకు ఆ పరిజ్ఞానం బాగానే ఉండేది. అన్ని అంశాలపై ఆయన బాగా అవగాహన కలిగి ఉండేవారు. అలాగే స్కూల్ రోజుల్లో వేసిన పలు నాటకాల్లోనూ ఆయన రాజకీయ నాయకుల పాత్రలలో మెప్పించారు. దీంతో ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అధ్యాపకులు అప్పట్లోనే గ్రహించారు. ఆ తరువాత ఆయన దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో మొదటగా చేరి, అటు నుంచి బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కీలక బాధ్యతలు నిర్వర్తించే పదవుల్లో చేరి.. ఆ తరువాత గుజరాత్ సీఎం అయి, అక్కడి నుంచి.. దేశ రాజకీయాల వైపు మళ్లి ప్రధాని అయ్యారు. ఆయన జీవితం ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..!