ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ కానుక‌..!

-

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు కానుక ఇవ్వ‌నున్నారు. నేష‌న‌ల్ డిజిట‌ల్ హెల్త్ మిష‌న్ (ఎన్‌డీహెచ్ఎం) పేరిట ఓ కొత్త కార్య‌క్ర‌మానికి ఆయ‌న శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. దీని ద్వారా దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించిన వివ‌రాల‌తో ఓ రిజిస్ట్రీ త‌యారు చేస్తారు. అందులో ఒక్కో వ్య‌క్తికి ప్ర‌త్యేకంగా ఓ హెల్త్ ఐడీ ఉంటుంది. అందులో ఒక్కో వ్య‌క్తికి సంబంధించిన ఆరోగ్య వివ‌రాల‌ను, అత‌నికి ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌మోదు చేస్తారు. ఇందుకు గాను ప్ర‌త్యేకంగా యాప్‌, వెబ్‌సైట్‌ల‌ను కేంద్రం ఇప్ప‌టికే అభివృద్ధి చేస్తోంది. త్వ‌ర‌లో వాటిని మోదీ ఆవిష్క‌రిస్తారు.

ఎన్‌డీహెచ్ఎంలో ప్ర‌జ‌లంద‌రూ త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. అందులో ఎవ‌రి బ‌ల‌వంతం ఉండ‌దు. పేర్ల‌ను న‌మోదు చేసుకున్న వారి ఆరోగ్య వివ‌రాలు అందులో ఉంటాయి. వారికి ఐడీల‌ను ఇస్తారు. ఇక వారు అవ‌స‌రం అనుకుంటే ఆ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా త‌మ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గాను డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో వ‌ర్చువ‌ల్‌గా డాక్ట‌ర్ల‌ను క‌న్స‌ల్ట్ అవ్వ‌చ్చు. అనంత‌రం టెలి మెడిసిన్ స‌దుపాయం పొంద‌వ‌చ్చు. ఇక ప్రైవేటు హాస్పిట‌ల్స్ వారు ఇందులో భాగం కావాల‌నుకుంటే ముందుకు రావ‌చ్చు.

అయితే కేంద్రం తేనున్న స‌ద‌రు యాప్‌, వెబ్‌సైట్ల‌లో ఉండే ప్ర‌జ‌ల ఆరోగ్య డేటా, వారి వివ‌రాల‌ను వారు అనుమ‌తిస్తేనే హాస్పిట‌ళ్లకు ఆ వివ‌రాల‌ను షేర్ చేస్తారు. అందువ‌ల్ల ప్ర‌జ‌ల వివ‌రాలు అందులో భ‌ద్రంగా ఉంటాయి. ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి దేశ ప్ర‌జ‌ల‌కు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్నారు. దేశ ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్య వివ‌రాల‌తో ఓ రిజిస్ట్రీని న‌మోదు చేయ‌డంతోపాటు వారికి నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌ను అందించడ‌మే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. దీన్ని గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన ఆయుష్మాన్ భార‌త్‌తో లింక్ చేస్తారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version