మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్, వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సభా వేదికగా ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పసుపు రైతుల కల సాకారమైంది. ఇదిలా ఉంటే.. పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది.
సాగునీటి పథకాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది. సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. కానీ ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. సరసమైన ధరల్లో రైతులకు ఎరువు అందిస్తున్నాం. రైతుల కోసం రామగుండం ఫెర్టిలైజర్స్‌ను తెరిపించాం. తెలంగాణలో మా ప్రభుత్వం లేకున్నా.. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా.. కాసేపటి క్రితమే పసుపు రైతుల కోసం పసుపు బోర్డును ప్రకటించా. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి బిద్రీ కళాఖండాన్ని బహుమతిగా ఇచ్చాను. ఆ తర్వాత తెలంగాణ హస్తకళలకు మరింత గుర్తింపు వచ్చింది. తెలంగాణ హస్తకళలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. పసుపు రైతులకు ఆదుకునేందుకు ఇప్పటివరకు బోర్డు లేదని ఆయన అన్నారు.