సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోడీ పూజలు చేశారు. అనంతరం కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడీ గురువారం సాయంత్రం 6.45 గంటలకు ధ్యానంలో కూర్చున్నారు. ఆయన 45 గంటల పాటు ధ్యానం చేశారు. ఈ సమయంలో ప్రధాని కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరించారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే తీసుకున్నట్టు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీ 45 గంటలూ ఆయన మౌనంగానే ఉన్నారు. కాషాయ దుస్తులు, జపమాలతో ధ్యాన మండపంలో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న ప్రధానమంత్రి ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ధ్యానంలో భాగంగా సూర్యోదయ సమయంలో ఆయన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దాదాపు 131 ఏళ్ల కిందట స్వామి వివేకానంద ధ్యానం చేసిన చోటే ప్రధాని మోడీ కూడా 45 గంటలపాటు ధ్యానంలో కూర్చోవడం విశేషం.