అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా అక్కడి రైతులు మొండిగా పోరాడుతున్నారు. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్లాలని అమరావతి ప్రాంత మహిళలు నిర్ణయించారు.
ఉదయం తుళ్లూరు, మందడంతో పాటూ రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు, ముళ్ల కంచెలు అడ్డు పెట్టారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరగడంతో, రైతులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేసారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు మహిళా రైతుల తలలు పగిలినట్టు సమాచారం. కొంతమంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేసారు.
పోలీసులు మహిళలను ఈడ్చుకు వెళ్ళడం వివాదంగా మారింది. పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో ఉద్యమం తీవ్రంగా జరుగుతుంది. దీనిపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు దీనిపై ట్వీట్ చేసారు. “గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటి? వాళ్ళ గ్రామ దేవతలని పూజించుకోడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా? శుక్రవారం గుడికి వెళ్ళకపోతే మీలాగా కోర్టుకు వెళ్ళమంటారా? రైతులు గుడికి వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టుచేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా?” అని ట్వీట్ చేసారు.