కొణిజేటి రోశయ్యది 60ఏండ్ల సుదీర్ఘంగా రాజకీయ జీవితం. కాకలుతీరిన ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. దేశ తొలి ప్రధాని నెహ్రూ మొదలుకొని ఎంతో మంది ప్రధానులతో సన్నిహితంగా మెలిగారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా గవర్నర్‌గా ఎంతో సేవలందించారు. అత్యధికసార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు ముఖ్యమంత్రి ఎవరైనా సరే వారి క్యాబినెట్‌లో కొణిజేటి రోశయ్యకు స్థానం ఉండేది. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రులందరి ఆదరణ పొందారు. 1978 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు క్యాబినెట్ బెర్త్ దక్కేది. 1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి. 1980లో టీ అంజయ్య, 1982లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, 1989లో మర్రి చెన్నారెడ్డి, 1990లో నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి, 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, 2004లో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య తన రాజకీయ జీవితం స్వాతంత్ర్య సమరయోధుడు ఎన్.జి.రంగా స్థాపించిన స్వతంత్ర పార్టీ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1968, 1974, 1980, 2009లలో నాలుగుసార్లు ఎమ్మెల్సీగా, 1989, 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం 2009, అక్టోబర్‌లో సీఎంగా పనిచేసిన రోశయ్య 2011లో తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆయన 60ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని అటల్ బిహారీ వాజ్‌పేయీ వరకు అందరూ ప్రధానులతో కలసి పనిచేశారు.
1994 నుంచి 96 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా కొనిజేటి రోషయ్య సేవలందించారు.
దేశంలో అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కే రోషయ్య రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఆయన పదవీకాలంలోనే టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాయి. ప్రభుత్వ నిధులు వృథాకాకుండా సమర్థవంతంగా కేటాయింపులు చేయడమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి రోషయ్య ఖ్యాతి గడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకున్నారు.