తూర్పుగోదావరి జిల్లా అధికార వైఎస్సార్ సీపీ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరగనున్నాయా ? నేతల ఆధిపత్య పోరు మరింత పెరగనుందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులుకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక, త్రిమూర్తులు తర్వాత కాలంలో వైఎస్సార్ సీపీలో చేరిపోయినప్పటికీ.. నియోజకవర్గంలో ఆధిపత్యం విషయంలో ఇప్పటికీ అనేక సంఘర్షణలు జరుగుతున్నాయి.
ఇటీవల కొన్నాళ్లకిందట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తూర్పు పర్యటనకు వెళ్లినప్పుడు అన్నీ తానై ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు తోట. అక్కడే కొందరు చెల్లుబోయిన వర్గీయులు తోటపై చెప్పుతో దాడి చేయడం.. ఆ తర్వాత ఆ నేతపై హత్యా ప్రయత్నం జరగడం.. ఇది తోట వర్గీయుల పనే అని చెల్లుబోయిన వర్గం విమర్శలు చేయడంతో రామచంద్రాపురం వైసీపీలో రాజకీయ వేడి మామూలుగా లేదు. ఆ తర్వాత తోటకు అమలాపురం పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇవ్వడంతో ఈ వార్ మరింత ముదిరింది. తోట త్రిమూర్తులు రాజకీయాలు చేస్తున్నారని, పార్టీలో చిచ్చు రేపుతున్నారని చెల్లుబోయిన అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.
అనంతరం తోట తాను పార్టీకి కట్టుబడి ఉన్నాను కాని.. లేకపోతే తన అనుచరులు ఏం చేసేవారంటూ కూడా చెల్లుబోయినపై ఎదురు దాడి చేశారు. అంటే మొత్తంగా ఒకే నియోజకవర్గం రామచంద్రపురానికి చెందిన చెల్లుబోయినకు, తోటకు మధ్య ఉన్న ప్రత్యర్థి విభేదాలు.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. కొనసాగుతున్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్ధమైంది. అయితే, దీనికి చెక్ పెట్టడం మానేసిన పార్టీ అధిష్టానం.. ఇద్దరినీ సమన్వయం చేసుకునేలా ప్రోత్సహించని అధిష్టానం.. ఇప్పుడు చెల్లుబోయినకు మరింత ప్రాధాన్యం పెంచేసింది. ఆయనకు మంత్రిపదవి ఇచ్చింది. ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా.. తోట-చెల్లుబోయినలను కూర్చోబెట్టి విభేదాలు చక్కదిద్ది ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, అలా చేయలేదు.
ఇక ఇదే నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి బోస్ వర్గం కూడా బలంగానే ఉంది. ఇప్పుడు బోస్, మంత్రి చెల్లుబోయిన వేణు ఒక్కటయ్యే ఛాన్సులు ఉండడంతో తోట దూకుడుకు బ్రేకులు పడినట్లయ్యింది. ఇక త్రిమూర్తులకు ఇప్పటికే అమలాపురం పార్లమెంటరీ జిల్లా ఇన్‌చార్జ్ పదవితో పాటు మండపేట ఇన్‌చార్జ్ పదవి కూడా ఇవ్వడంతో రామచంద్రాపురం రాజకీయాల నుంచి ఆయన్ను సైడ్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న చర్చలు నడుస్తున్నాయి. అయితే రామంచద్రాపురంలో బలమైన కేడర్, అనుచరగణం ఉన్న తోట వచ్చే ఎన్నికల నాటికి అయినా వేణును పక్కన పెట్టి ఈ సీటు తాను దక్కించుకోవాలని నిన్నటి వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
ఇప్పుడు వేణు ఏకంగా మంత్రి కావడంతో పాటు తోటకు ఏకు మేకైపోయారు. దీంతో ఇప్పుడు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన.. రానున్న రోజుల్లో నియోజకవర్గం సహా కోనసీమలోని నియోజకవర్గాల్లోనూ తన ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఇక, తోట కూడా డక్కాముక్కీలు తిన్న బ్యాచేకాబట్టి ఆయనకూడా కాలురువ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో వీరద్దరి రాజకీయాలు మరింత దుమారం రేపడం ఖాయమనేది విశ్లేషకుల భావన. మరి ఏం చేస్తారో.. ఏం జరుగుతుందో చూడాలి.