ఏపీలో జగన్ పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయ్యాయి. మే 30న సీఎంగా ప్రమాణం చేసిన జగన్.. సెప్టెంబరు 6తో తన పాలనకు 100 రోజులు పూర్తి చేసుకున్నారు. 100 రోజుల పాలనలో జగన్ తీసుకున్న అనేక సంచలన నిర్ణయాలు.. అనేక వ్యూహాత్మక అడుగులు రాష్ట్రం, కేంద్రంలోనూ చర్చకు వచ్చాయి. ఒక్క పోలవరం, అమరాతి నిర్మాణాల విషయాన్ని రివర్స్ టెండరింగ్ విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన నిర్ణయాలు పూర్తిగా ప్రజారంజకంగానే సాగాయి. ముఖ్యంగా ఉద్యోగ కల్పనకు, రైతులకు భరోసా నివ్వడంలోను, మహిళలకు, చిన్నస్తాయి ఉద్యోగులకు మరింతగా జీతాలు పెంచడంలోనూ జగన్ చేసిన నిర్ణయాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’. చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం. ‘స్పందన’లో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష.. ప్రజా సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్. సీపీఎస్ రద్దుకు నిర్ణయం. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కడపలో స్టీల్ ప్లాంట్‌కు ఈ ఏడాది డిసెంబరు 26న శంకుస్థాపన. వంటి నిర్ణయాలు మంచి పేరు తెచ్చాయి.
అదే సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో .. పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని, పారదర్శకమైన ఇండస్ట్రీయల్ పాలసీ. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేశారు. అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం వంటివి కలిసి వచ్చాయి. అమరావతిలో గత ప్రభుత్వం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వాస్తవాల వెలికితీతకు చర్యలు తీసుకున్నారు. దీనిపై అన్ని పక్షాలు స్వాగతించాయి. అయితే, అదే సమయంలో నిర్మాణాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని మాత్రం అందరూ సూచించారు. మొత్తంగా చూస్తే.. జగన్ పాలనకు ఈ 100 రోజుల్లో 90 మార్కులు పడ్డాయని మేధావులు చెబుతున్నారు.