విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇటువంటి టైములో కరోనా వైరస్ రావడంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. దీంతో ప్రస్తుతం ఆర్థికంగా అనేక అవస్థలు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్. పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దీంతో 2019లో అధికారంలోకి రావటం తోనే ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేస్తూ పక్కా ప్లానింగ్ తో పరిపాలన చేసుకుంటూ వెళుతున్నారు. ఒకపక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాకుండా రెండూ సమపాళ్లలో ఉండేలా పరిపాలన చేస్తున్నారు.
కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి కూడా లేని స్థితికి ఏపీ ఖజానా దిగజారిపోయింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం జగన్ కి అసలు సిసలైన ఛాలెంజ్ అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో కరోనా తగ్గిన తర్వాత సీఎం జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ ఇంకా అనేక నీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఎలా కంప్లీట్ చేస్తారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.