అటు లోక్ సభ ఎన్నికలు, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే అధికార టీడీపీ నుంచి చాలా మంది నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇక రాజకీయ నాయకుల బాటలోనే అటు పలువురు సినీ ప్రముఖులు కూడా పయనిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఇవాళ వైకాపా అధినేత జగన్‌ను కలిశారు. వారిద్దరి మధ్య జరిగిన భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్‌లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇవాళ కలిశారు. జగన్‌తో నాగార్జున చాలా సేపు భేటీ అయ్యారు. కాగా వారి భేటీ ఇప్పుడు రాజకీయ ప్రపంచంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలోనే నాగార్జున వైకాపా తరఫున రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
సుమారు అరగంట పాటు భేటీ అయిన జగన్, నాగార్జునలు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. అయితే జగన్‌తో భేటీ అయిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ క్రమంలో నాగార్జున గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా ఆయన తన భార్య అమలను వైకాపా తరఫున పోటీలో దింపుతారా అన్న సందిగ్ధత నెలకొంది. కాగా మరో వైపు సినీ నటుడు మంచు విష్ణు దంపతులు ఇటీవలే జగన్‌ను కలిసిన విషయం విదితమే. విష్ణు భార్య వెరోనికా జగన్‌కు బంధువు. ఈ క్రమంలో విష్ణు తండ్రి, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీ నుంచి ఎన్నికల బరిలో ఉంటారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.
నిజానికి నాగార్జునకు జగన్ కుటుంబంతో దగ్గరి సంబంధాలు ఉన్నాయనే చెప్పవచ్చు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాగార్జున అనుకూలంగా వ్యవహరించారు. ఈ క్రమంలో వైఎస్ మరణం అనంతరం కూడా జగన్‌తో నాగార్జున సాన్నిహిత్యంగానే ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా నాగార్జున మరోసారి జగన్‌ను కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరి నాగ్ వైకాపా తరఫున ఈ సారి బరిలోకి దిగుతారా, లేదా అన్నది మరికొంత కాలం వేచి చూస్తే తెలుస్తుంది..!