జగన్ సర్కార్ వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. అభివృద్ధి శూన్యమంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మాటలతో కాకుండా… చేతలతో సమాధానం చెప్తోంది వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధిని గాలికి వదిలేశాడంటూ జగన్‌పై చేస్తున్న విమర్శలకు లెక్కలతోనే జవాబు చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అంటూ జగన్ చెప్పిన మాట అక్షరాల రుజువవుతోంది.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం శరవేగంతో వృద్ధి చెందుతోంది. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు… రాష్ట్ర ఖజానాకు ఊపిరిగా మారాయి. పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు జీఎస్టీ వసూలే సమాధానం చెబుతున్నాయి.
జీఎస్టీ వసూళ్లలో ఏపీ టాప్ ప్లేస్‌లో నిలుచుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్ర ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందనేందుకు జీఎస్టీ వసూళ్లే నిదర్శనం. లబ్దిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందించడం ద్వారా… వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయనేది వాస్తవం. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఆ ప్రభావం వాణిజ్య, పారిశ్రామిక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం తీసుకున్న సులభతర వాణిజ్య విధానాలు కూడా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయి. విశాఖలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలో ఏకంగా రూ.13 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బడా సంస్థలు సైతం ఎంఓయూలు చేసుకున్నాయి. వీటితో పాటు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో సీఎం జగన్ సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం…. విజయం సాధించింది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలే ఇందుకు నిదర్శనం.
ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం వసూలు జీఎస్టీ లెక్కల్లో జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తోంది. ఆదాయంలో మేమే టాప్ అని చెప్పుకుంటున్న తెలంగాణను మూడోప్లేస్‌కు నెట్టేసిన ఏపీ… 12 శాతం వృద్ధి రేటుతో కర్ణాటకతో పోటీ పడుతోంది. తెలంగాణ కేవలం పది శాతం మాత్రమే వృద్ధిరేటు నమోదు చేసింది. తమిళనాడు, కేరళలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. దేశ వ్యాప్తంగా ఒక్క అక్టోబర్ నెలలోనే రూ.1,72,003 కోట్ల స్థూల జీఎస్‌టీ వసూలైంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నుల ఆదాయంలో దూసుకుపోతోంది. దీనికి సీఎం జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు.