లెక్క తేలింది.. త్వ‌ర‌లోనే నామినేటెడ్ పోస్టుల ప్ర‌క‌ట‌న‌

-

అధికారంలోకి వ‌చ్చి చాలా టైమ్ గ‌డిస్తే కానీ నామినేటెడ్ పోస్టుల‌ను ప్ర‌క‌టించ‌ర‌ని చంద్ర‌బాబునాయుడుపై అప‌వాదు ఉంది. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రి అయిన సంద‌ర్భాల్లో ఇదే రిపీట్ అయింది. అయితే ఈసారి మాత్రం చంద్ర‌బాబు మారిన‌ట్లు క‌నిపిస్తోంది. త‌న‌పై ఉన్న అప‌వాదును తొల‌గించుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ముందుగా జ‌న‌సేన నుంచి క్లారిటీ రావ‌డంతో చంద్ర‌బాబు మ‌రో ముంద‌డుగు వేశారు. బీజేపీతో కూడా చ‌ర్చించిన ఆయ‌న నామినేటెడ్ ప‌ద‌వుల పందేరంపై త్వ‌ర‌లో కీల‌క అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ వార్త తెలియ‌డంతో ఆశావ‌హులు సంతోషం వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేన పార్టీల్లో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు నామినేట్ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. అటు నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్‌ పదవులపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. వీటి భర్తీపై మూడు పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరిన‌ట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం నామినేటెడ్‌ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చేలా చంద్ర‌బాబు ప్లాన్ చేశార‌ని స‌మాచారం.

30 శాతం జనసేన శ్రేణులకు, మిగతా పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం పోస్టులు ఆ పార్టీకే ద‌క్క‌నున్నాయి. అక్క‌డ 30 శాతం పోస్టులు టీడీపీకి, 10శాతం బీజేపీ వారికి కేటాయించేలా స‌మీక‌ర‌ణ‌లు రూపొందించారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50 శాతం పదవులు, మిగిలిన 50 శాతం టీడీపీ, జనసేనలకు స‌మానంగా దక్కుతాయని సమాచారం. జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు నామినేటెడ్‌ పోస్టుల సర్దుబాటుపై నిన్న‌టి రోజున‌ స్పష్టత ఇచ్చారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన నాయకులను గుర్తు పెట్టుకోవ‌డంతో పాటు ఎమ్మెల్యేలంతా కష్టపడిన వారికి గుర్తింపు ఇచ్చేలా చూడాల‌ని, పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యమివ్వాలని సృష్టం చేశారు. నియోజకవర్గాల్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి, వారి వివరాలు పంపించాలని కోరారు. కూట‌మి పార్టీల మ‌ధ్య కుద‌రిని ఒప్పందం నేప‌ధ్యంలో త్వ‌ర‌లో ప‌ద‌వుల లిస్ట్‌ను ప్ర‌క‌టించేందుకు సీఎం చంద్ర‌బాబునాయుడు సిద్ధ‌మ‌య్యార‌ని టీడీపీ వ‌ర్గాల స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version