ఆంధ్రావని వాకిట ఓ వివాదం ముదురుతోంది. తీవ్ర స్వరం అందుకుంటోంది. రైతన్నల ఉద్యమ పోరు మరింత ఉద్ధృతి రూపం తీసుకోనుంది. ఆ విధంగా ఇవాళ జగన్ సర్కారు సాగు పరంగా చేస్తున్న ఖర్చు, తీసుకున్న శ్రద్ధ అన్నవి కృష్ణార్పణమా అన్న అనుమానాలు వస్తున్నాయి అని, ఆ నీటి రాతల కారణంగానే ఈ కన్నీళ్లు ఉన్నాయని వీటిని ఎవరు తీరుస్తారని తుడుస్తారని బాధాతప్త హృదయంతో దుఃఖంతో నిండిన గొంతుకలతో రైతాంగం ఘోషిస్తోంది. ఇదే ఇవాళ్టి బర్నింగ్ టాపిక్.
కోనసీమ వాకిట పంట విరామం ప్రకటించిన రైతులు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేం అనే చెబుతూ వస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా పాతిక వేల కోట్లకు పైగా రుణ మాఫీ కోసం, రైతు భరోసా కోసం ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం కనీసం పాతికవేలు వెచ్చించి పూడికలు తీయించలేదా అని ప్రశ్నిస్తోంది. సాగునీరు సాగక ముంపు కారణంగా ఏటా పొలాలలో నీళ్లు నిల్వ ఉండిపోయి, భారీ వర్షాల కారణంగా తామంతా తీవ్ర నష్టాలను చవి చూస్తూ వస్తున్నామని, వీటిపై కనీస స్పందన లేకుండా యంత్రాంగం ఉంటోందని మండిపడుతోంది ఇక్కడి రైతాంగం. ఇదే సమయంలో కడియంలో రైతులు కూడా పంట విరామం ప్రకటించారు.
ఈ రెండు ప్రాంతాలనే కాదు తాజాగా సీఎం ఇలాకాలో సీమలో పంట విరామం అన్నది తాజా వివాదానికి నాంది పలుకుతోంది. లేదా నిన్నటి కోస్తా వివాదానికి కొనసాగింపుగా ఉంది. ఎందుకంటే కడప జిల్లాలో కేసీ కెనాల్ వాటర్ ఉన్నా, సరైన రీతిలో ప్రభుత్వ ప్రోత్సాహం అందక అక్కడి రైతాంగం ఏటా అవస్థలు పడుతోంది. ఇక్కడ 90 వేల హెక్టార్లలో పంట భూములకు పుష్కలంగా నీరు అందుతున్నా కూడా సాగు మాత్రం 35 వేల హెక్టార్లకే పరిమితం అవుతోంది.
వరి కారణంగా తాము ఏటా నష్టపోతున్నామని ఎకరాకు తాము ఖర్చు పెట్టే డబ్బు 30 వేల రూపాయలకు పైగా అయినా కూడా తమకు బాగా ఆశించిన మేర పంట పండినా కూడా అంటే మూడు పుట్ల ధాన్యం అందినా కూడా అంటే 1800 కిలోలు వచ్చినా కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అంటే క్వింటాకు 2040 లెక్కన చెల్లిస్తే 18 క్వింటాలకు (క్వింటా అంటే వంద కిలోలు) 36 వేల 720 రూపాయలు మాత్రమే వస్తుందని అంటే ఎకరాకు లాభం ఆరు వేల 720 రూపాయలు మాత్రమే అని ఇది మూడు
నెలల కష్టానికి ప్రతిఫలం అనుకున్నా నెలకు 3 వేల రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అందుకే తాము పంట విరామం ప్రకటిస్తున్నామని చెబుతున్నారు.