అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు మంత్రి వర్గంలో చోటు దక్కని ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. నిబంధనల ప్రకారం సీఎంతో కలిపి మొత్తం 26 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అయితే బిజేపీతో తెగదెంపులు చేసుకున్నాక దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న పైడి కొండల మాణిక్యాలరావు, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్‌రావులు మంత్రిపదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పిస్తామని చెప్పిన సీఎం.. ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదు. దీంతో ఈ రెండు స్థానాలను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనారిటీల్లో ఎమ్మెల్సీ షరీఫ్‌తోపాటు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన జలీల్‌ఖాన్, అత్తార్ చాంద్‌బాషాలు ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ ఫరూక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ షరీఫ్‌కు ఇవ్వాలని పార్టీ నేతలు బాబుపై ఒత్తిడి తెస్తుండగా, మరికొందరు మాత్రం రాయలసీమకు చెందిన మైనార్టీ నాయకుడికి చోటిస్తే బావుంటుందని బాబు చెవిలో చెప్పారట. ఈ నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి వస్తుందనేది అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌కు మరోసారి మంత్రి పదవి ఇవ్వడం కంటే, కొత్తవారికి ఇవ్వడం ద్వారా పార్టీకి మంచి జరుగుతుందంటున్నారు. ఇక ఎస్టీల విషయానికి వస్తే.. పోలవరం ఎమ్మెల్యే, అలాగే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన వేళ ఆయన తనయుడు శ్రవణ్‌ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.