బటన్లు నొక్కుడు…లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం…గత ఐదేళ్లలో వైసీపీ చేసిన పని ఇది.దీనివలన లబ్ధిదారులకు నగదు చేరుతుందేమో కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి వెళ్లలేవు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా స్వయంగా చంద్రబాబే లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి పెన్షన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రను లిఖించబోతున్నది. దేశ చరిత్రలోనే తొలిసారి ఏ ముఖ్యమంత్రి చేయని పనిని ఇప్పుడు చంద్రబాబు చేయబోతున్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. దీనికి ముహూర్తం,వేదిక ఖరారయ్యాయి.ఈ చారిత్రక ఘట్టానికి తాడేపల్లిలోని పెనుమాక గ్రామం వేదికైంది.
నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబునాయుడు గతంలో కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఫించన్లను 3వేల నుంచి 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం ఆ ఫైల్ పైనే చేశారు.ఇకపై నెలనెల ఫించన్లు అందుకునే వారికి ఒక వెయ్యి అదనంగా వస్తుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ఫించన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. మీకు అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని అందులో పేర్కొన్నారు. జూలై 1 నుంచే పెంచిన ఫించన్లను ఇంటివద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకూ ఏ సీఎం చేయని విధంగా చంద్రబాబు నాయుడు జూలై 1న స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఫించన్ ఇవ్వబోతున్నారు.
పెరిగిన ఫించన్‌తో పాటు గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన అరియర్స్ 3వేలు కలిపి మొత్తం 7వేల రూపాయలను ప్రతి లబ్ధిదారుకు అందించనున్నారు. గత ప్రభుత్వం లాగే కొత్త ప్రభుత్వం కూడా ఫించన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి డబ్బు ఇవ్వనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది ఫించనుదారులందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించనున్నారు. జులై ఒకటో తేదీ నుంచి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.. ఇంటికే వచ్చి పెన్షన్ సొమ్ము అందిస్తామని చెప్తున్నారు.
గ్రామ సచివాలయాలకు , బ్యాంకుల వద్దకు ఎవ్వరు వెళ్ళవద్దని పెన్షనర్లకు అధికారులు, సచివాలయం సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.. పెన్షనర్లు సచివాలయాలకు రావద్దని, ఒకటవ, రెండవ తారీఖుల్లో పింఛన్ దారులు ఇంటి వద్దనే ఉండాలని సచివాలయాల ముందు సిబ్బంది పోస్టర్లు ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా.. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమానికి చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ఏపీ ప్రజలు హర్షిస్తున్నారు.