ఏపీలో కొత్త జిల్లాల‌కు డేట్ ఫిక్స్‌..!

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను సీఎం అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన చేసి ప్రతి లోక్‌స‌భ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాన‌ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జిల్లాల కసరత్తు ప్రారంభించినా తర్వాత ఈ ప్రక్రియ కాస్త స్లో అయ్యింది. ఇక తాజాగా జగన్ గవర్నర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో ఇదే అంశంపై మాట్లాడినట్టు తెలిసింది జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. జిల్లాల పునర్విభజనతో పాలనలో కొత్త ఒరవడికి… వికేంద్రీకృత సేవలకు శ్రీకారం చుట్టాల‌న్న‌దే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

తెలంగాణలో ఇంతకుముందున్న పది జిల్లాలను కేసీఆర్ సర్కార్ ఏకంగా 33 జిల్లాలుగా మార్చింది. జిల్లాల పునర్విభజన జరగడంతో తెలంగాణలో పాలన ప్రజలకు మరింత చేరువైంది. ఇక ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌తి లోక్‌స‌భా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఓ జిల్లాగా చేస్తాన‌ని చెప్పారు. ఇక అర‌కు నియోజ‌క‌వ‌ర్గం ఏకంగా నాలుగు జిల్లాల్లో ఉండ‌డంతో పాటు దూరంగా ఉండ‌డంతో మ‌ధ్య‌లో పార్వ‌తీపురం కేంద్రంగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల‌తో మ‌రో జిల్లా ఏర్పాటు చేయాల‌ని ముందుగా నిర్ణ‌యించుక‌న్నారు.


ఇక ఇప్పుడు మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తే కొన్ని ఇబ్బందులు ఉండ‌డంతో ఇప్పుడున్న 13 జిల్లాల‌కు తోడుగా మ‌రో 8 జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒంగోలు ప‌క్క‌న గ్రామాలు ఎక్క‌డో గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల‌లో క‌లుస్తాయి. విజ‌య‌వాడ ప‌క్క‌న ఉన్న గ్రామాలు మ‌చిలీప‌ట్నంలో క‌లుస్తాయి. మచిలీప‌ట్నం ప‌క్క‌న ఉన్న గ్రామాలు ప‌క్క‌నే ఉన్న ఏలూరులో క‌లుస్తాయి. ఏలూరు ప‌క్క‌న ఉన్న గ్రామాలు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో క‌లుస్తాయి.

ఇక కొవ్వూరు ప‌క్క‌నే ఉన్న పోల‌వ‌రం ఎక్క‌డో ఉన్న ఏలూరులో క‌లుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కాకుండా ప్రాంతాలు, పాల‌నా సౌల‌భ్యంతో పాటు ప్ర‌జ‌ల‌కు జిల్లా కేంద్రం అందుబాటులో ఉండేవిధంగా వీటిని ఏర్పాటు చేయ‌నున్నారు. క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు ల్లాల్లోనూ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిని ఈ నాలుగు నెల‌ల్లో ఓ కొలిక్కి తేనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version