‘పంచాయ‌తీ’ ఎన్నిక‌లు వైకాపాలో ‘పంచాయితీ’ పెడుతున్నాయా?

-

  • గ్రూప్ ‘పంచాయితీలతో అధికార ప‌క్షం స‌త‌మ‌త‌మ‌వుతోందా?
  • వైకాపా అంత‌ర్గ‌త విభేదాలు ఎటువైపు క‌దులుతున్నాయి?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అధికార, ప్రతిప‌క్ష పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల ప‌రంప‌ర కోన‌సాగుతోంది. ఈ మాట‌ల యుద్ధం కాస్తా.. శృతిమించి కొన్ని చోట్ల భౌతిక దాడుల‌కు సైతం దారీతీస్తోంది. ఈ ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ప్ర‌తిప‌క్ష టీడీపీ, అధికారప‌క్షం వైకాపా మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భగ్గుమ‌నే స్థాయికి చేరింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం వైకాపా ప్ర‌భుత్వానికి ఈ ఎన్నిక‌లు తీవ్ర త‌ల‌నొప్పిగా మారాయ‌ని పిస్తోంది. ఎందుకంటే ఇటు ప్ర‌తిప‌క్షాల పోరుతో స‌త‌మ‌త‌మవుతున్న వేళ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా అధికారా ప‌క్షాన్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయి. ఇది కాకుండా ఎన్నిక‌లు స్వ‌ప‌క్ష శ్రేణుల నుంచే వైకాపాకు తీవ్ర త‌ల‌నొప్పులు క‌లిగించే విధంగా ప‌రిస్థితులు మారుతున్నాయ‌ని తాజా చోటుచేసుకుంటున్న ప‌రిస్థితుల‌ను చూస్తే ఇట్టే తెలిసిపోతోంది.

నిజంగానే ఈ పంచాయ‌తీ ఎన్నిక‌లు వైకాపాకు త‌ల‌నొప్పులు తీసుకురానున్నాయా?. వైకాపాలో చోటుచేసుకుంటున్న గ్రూప్ వార్‌లు పార్టీలో గ్రూప్ రాజ‌కీయాల‌కు బీజం పోయ‌నున్నాయా? ప‌ంచాయ‌తీ ఎన్నిక‌లు వైకాపా శ్రేణుల‌ను విడ‌గొట్ట‌నుందా? అంటే ఇవ‌న్ని ప్రశ్న‌ల‌కు ప్ర‌స్తుతం ఖచ్చితంగా అవును, కాదు అనే స‌మాధానాలు రాక‌పోయిన‌ప్ప‌టికీ.. ఈ విషయంపై పార్టీ అధష్ఠానం పెద్దగా పట్టించుకోకపోతే భ‌విష్య‌త్తులో మాత్రం ఈ ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఎందుకంటే రాష్ట్ర పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికార పార్టీ వైకాపా మ‌ద్ద‌తు ఉన్న అభ్య‌ర్థులు, పార్టీ శ్రేణుల‌ను గెలిపించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశాలు అందించారు. మ‌రీ ముఖ్యంగా పంచాయ‌తీలు ఏక‌గ్రీవాల వైపు ప‌య‌నించే దిశ‌గా పార్టీ శ్రేణులు కృషి చేయాల‌ని చెప్ప‌డంతో ఏకంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ‌క్క‌డ త‌క్కువ‌గానే వినిపించిన వైకాపా గ్రూప్ పంచాయ‌తీలు.. నేడు భగ్గుమంటున్నాయి.

దీనిని ప్ర‌ధాన కార‌ణం ఒకే పార్టీకి చెందిన నేత‌లు అయిన‌ప్ప‌టికీ.. బ‌రిలో నిలిచేవారు అధికంగా ఉండ‌టం, ఇర పార్టీల వారిని బ‌రిలో ఉండ‌కుంగా చేసే క్ర‌మంలో పార్టీకి చాలా కాలంగా సేవ చేస్తున్న వారిని ప‌క్క‌న పెట్ట‌డం, సొంత పార్టీ గ్రామాల్లోని గ్రూప్ రాజ‌కీయాలు వైకాపాలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స్థానికి గ్రూప్ రాజ‌కీయాల‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కంట్రోల్ చేయ‌లేని ప‌రిస్థితి దాపురించింది.

దీనికి తాజాగా జ‌రిగిన కర్నూలు ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నగరంలోని ఓ హోటల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అయితే, నందికొట్కూరు విభేదాలపై చ‌ర్చ జరుగుతుండగానే నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ఆర్థర్, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయి. సిద్ధార్థ రెడ్డి పీఏ రమణ, వైసిపి నేత చెరుకుచెర్ల రఘురామయ్య మధ్య వాగ్వాదం పెరిగి కుర్చీలు ఎత్తుకునే వరకు వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

ఇక చిత్తూరు జిల్లాను తీసుకుంటే ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా వీరు ఎవరి మధ్య సఖ్యత లేదు. ఇక వీరి మధ్య ఉన్న ఘర్షణలు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య కూడా అలాగే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి దాపురించింద‌ని అప్పుడ‌ప్పుడు చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ఇక పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ఎదురుచూస్తున్న వారిని ఏక‌గ్రీవాల పేరిట బుజ్జ‌గింపున‌కు దిగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల‌కు స్థానిక క్యాడ‌ర్ నుంచి తీవ్ర ఒత్తిడి క‌లుగుతోంద‌ని తెలుస్తోంది. ఇక మ‌రికొన్ని చోట్ల అయితే… ఎంతో కాలంగా పార్టీ కోసం ప‌నిచేస్తుంటే మ‌రొక‌రికి ప‌ద‌వులు ఇస్తారా? అంటూ బాహాటంగానే నిల‌దీస్తున్నారు ! ఇదంతా చూస్తుంటే పంచాయ‌తీ ఎన్నిక‌లు కాస్తా.. అధికార పార్టీలో పంచ‌యితీ పెట్టేలా క‌నిపిస్తున్నాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు ! చూడాలి మునుముందు వైకాపా ఈ అంత‌ర్గ‌త పోరును ఎలా సద్దుమ‌నిగేలా చేస్తోందో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version