హస్తిన కేంద్రంగా కమలం పార్టీ రాజకీయాలు.. ఈసారిగా ఎలాగైనా గెలవాలని వ్యూహాలు..

-

బిజేపీ సీరియస్ గా దృష్టి పెడితే ఏ రాష్టంలోనైనా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ట్రాక్ రికార్డు చెబుతోంది.. ఇటీవల జరిగిన ఎన్నికల్లే వాటికి ఉదాహరణ.. దేశంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపీ.. ఢిల్లీలో మాత్రం అధికారాన్ని చేపట్టలేకపోతోంది.. మూడు దశాబ్దాలుగా అధికారం అనేది వారికి కలగా మారింది.. కానీ ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం మామూలుగా ఉండవన్న సంకేతాలిస్తోంది..

మరో రెండు నెలల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి.. ఈసారి హస్తినలో పాగా వెయ్యాలని కమలం పార్టీ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది.. 1993లో గెలుపొందిన ఆ పార్టీ, మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది. దీంతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది.. వరుసగా రెండు సార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారి బలంగా కొట్టాలనే ఆలోచనలో బిజేపీ ఉంది..

తాజాగా జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించిన కమలదళం ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని కసరత్తు చేస్తోంది.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించక ముందే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.. ముందుగానే అభ్యర్దులను ప్రకటించాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో బలమైన అభ్యర్దుల కోసం వేట ప్రారంభించింది..

నిత్యం ప్రజల్లో ఉండే నేతలకే మొదటి ప్రయార్టీ ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తోందట.. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన అభ్యర్దులను పక్కన పెట్టాలనే ఉద్దేశ్యంలో కూడా అగ్రనేతలు ఉన్నారని సమాచారం.. దాంతో పాటు ప్రజలను ప్రభావితం చెయ్యగలిగే నేతలుగా పేరున్న మీనాక్షి లేఖి, పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి వంటి వారికి ప్రచార బాధ్యతలు అప్పగించేలా ఆలోచనలు చేస్తున్నారు..
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాష్ట్ర మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు జాట్ సామాజికవర్గంలో గట్టి పట్టు ఉండటంతో ఆయనను నజఫ్‌గఢ్ నుంచి బరిలోకి దించే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానాను మోతీనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి..

70 అసెంబ్లీ స్థానాల్లో యంగ్ స్టర్స్ ను ప్రోత్సహించాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట.. దాదాపు 35 స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఉండబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.. ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఆప్ ఓటు బ్యాంకు గా ఉన్న నిరుపేదల ఓట్లను కొల్లగొట్టేలా బిజేపీ కార్యక్రమాలను రూపొందిస్తోంది.. బిజేపీ వ్యూహాలు ఢిల్లీలో ఎలా ఫలించబోతున్నాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version