ఇంతకాలం తిరుగులేని బలంతో ఉన్న కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు ఈటల రాజేందర్ రూపంలో బీజేపీకి అదిరిపోయే అస్త్రం దొరికింది. ఈటలని ముందు పెట్టి కారు పార్టీని కకావికలం చేయాలని కమలదళం కొత్త స్కెచ్ వేస్తుంది. ఇప్పటికే పలుసార్లు కారుకు కమలం బ్రేకులు వేసింది. ఇక ఈటలని చేర్చుకుని హుజూరాబాద్‌లో గెలిచి కారుకు చెక్ పెట్టారు. ఇక అక్కడ నుంచి ఈటల ద్వారా కారుకు శాశ్వతంగా బ్రేక్ వేసేందుకు కమలం నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.
ఈటలని బేస్ చేసుకుని కేసీఆర్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పుడు కమలంలో ఈటలనే ఎక్కువ ప్రజాదరణ కలిగిన నేత. బీజేపీలో ప్రజాదరణ కలిగిన నేతలు ఉన్నా సరే ఈటలకు ఉన్న అడ్వాంటేజ్ వేరు. ఆయనకు అన్నిరకాలుగా ఆదరణ ఉంది…తెలంగాణలో రాజకీయంగా పట్టు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా టీఆర్ఎస్‌లో ఉన్న లొసుగులు ఏంటి…కేసీఆర్ బలహీనతలు ఏంటి అనేది ఈటలకు బాగా తెలుసు.
ఎందుకంత గత 20 ఏళ్లుగా కేసీఆర్‌ని దగ్గర నుంచి చూస్తున్న నేత ఈటల. అలాగే టీఆర్ఎస్‌లో కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న నేతలు ఎవరో కూడా ఈటలకు బాగా తెలుసు. అందుకే ఆయన్ని ముందుపెట్టి కేసీఆర్‌ని దెబ్బకొట్టడానికి కమలం పార్టీ అదిరిపోయే స్కెచ్‌లు రెడీ చేసింది. అంటే టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలని బీజేపీలోకి తీసుకు వచ్చి టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇక టీఆర్ఎస్‌లో అందరూ నేతలతో ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…అలాగే అందులో ఉన్న ఉద్యమ నేతలు సైతం కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్నారు. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు. ఇక అలాంటి నాయకులని బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యత ఈటలకు అప్పగించారు.
అలాగే ఈటలతో మరో సీనియర్ నాయకుడు జితేంద్రరెడ్డిని సైతం ఈ వ్యూహంలో భాగం చేశారని తెలుస్తోంది. ఇక వీరితో టీఆర్ఎస్‌లో కీలక నాయకులని బీజేపీలోకి లాగాలని చూస్తున్నారు. అదే విధంగా ఈటలతో రాష్ట్రంలో బీసీ వర్గాలని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేయనున్నారు. మొత్తానికి ఈటల బీజేపీ పాలిట ఓ బంగారు బాతు మాదిరిగా దొరికారు.