తెలంగాణలో ఎన్నికలు ఆరు నెలలు ఉండగానే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితా ప్రకటించి ప్రచారం ప్రారంభించి ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలి అని కేసిఆర్ ముందుగానే 115 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక ఏడు స్థానాలకు మాత్రం సిట్టింగ్ అభ్యర్థులు కాకుండా కొత్త వారికి స్థానం ఇచ్చారు.
“తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు ఉంది” తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దగ్గర నుండి నిరసనలు, అసమ్మతినేతల బుజ్జగింపులతో గులాబీ పార్టీకి నిద్ర లేకుండా చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న అభ్యర్థులు ఈసారి తమకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. సిట్టింగ్ అభ్యర్థులకు ఇవ్వని స్థానాలలో సిట్టింగ్ అభ్యర్థులు తమనెందుకు తప్పించారని అసమ్మతిగళం వినిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చిన చోట తాము మద్దతు తెలపబోమని, వారికి ఓట్లు వేసేది లేదని అసమ్మతినేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అసమ్మతి వారంతా ఒక వర్గం గా తయారై ఎన్నికలలో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల సమాచారం.
నేతల మధ్య అసమతి నేతలతో సయోధ్య కుదర్చడానికి కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావుకు సమయం సరిపోవడం లేదు. వీరు సయోధ్య కుదిర్చినా వారి ముందు ఒప్పుకొని నియోజకవర్గానికి వెళ్లిన తర్వాత తమ అసమ్మతిగళం మళ్ళీ వినిపిస్తున్నారు. అలాంటి కొన్ని నియోజకవర్గాలు కెసిఆర్ కు తలనొప్పిగా తయారయ్యాయి.
స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి కి టికెట్ ఇవ్వగా రాజయ్య తన మద్దతు ప్రకటించను అని చెప్పాడు. రాజయ్య మద్దతు శ్రీహరికి అని బిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా రాజయ్య నియోజకవర్గం వెళ్లి ఈసారి ఈ టికెట్ మనదే అని చెప్పడంతో బిఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అసమ్మతినేతల మధ్య, టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల మధ్య ఇప్పుడు సయోధ్య కుదిర్చిన ఎన్నికల సమయానికి వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అని బిఆర్ఎస్ అధిష్టానం అయోమయంతో ఉంది.